పన్నీర్ సెల్వంకు షాక్.. అక్రమ సంపాదన కేసుపై 11 ఏళ్ల తర్వాత పునర్విచారణ జరుపుతున్న హైకోర్టు

Madara High Court reopens Pannerselvam corruption case
  • 2001-06 మధ్య కాలంలో జయ హయాంలో పన్నీర్ అవినీతి కేసు
  • 2012లో నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన దిగువ కోర్టు
  • రాజకీయ పార్టీలు, ఏసీబీపై విమర్శలు గుప్పించిన హైకోర్టు
తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ సంపాదన కేసు పునర్విచారణను సుమోటోగా స్వీకరించింది. ఈ కేసు నుంచి పన్నీర్ సెల్వంకు విముక్తి కల్పించిన దిగువ కోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

కేసు వివరాల్లోకి వెళ్తే, 2001-06 మధ్య కాలంలో దివంగత జయలలిత ప్రభుత్వంలో పన్నీర్ సెల్వం రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఆయన ఆదాయానికి మించి రూ. 1.77 కోట్ల మేర అక్రమంగా సంపాదించారంటూ 2006లో అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో పన్నీర్ తో పాటు ఆయన భార్య విజయలక్ష్మి, కుమారుడు రవీంద్రనాథ్ లతో పాటు ఆరగురిపై ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. 

2011లో అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి రాగానే అక్రమార్జన కేసుపై విచారణ జరిపేందుకు అనుమతిని వెనక్కి తీసుకుంది. ఇదే సమయంలో నిందితులపై ఆరోపణలు రుజువు చేసేందుకు సరైన ఆధారాలు లభించలేదంటూ ఏసీబీ అధికారులు కోర్టుకు నివేదికను అందించారు. దీంతో, శివగంగ కోర్టు 2012లో వీరందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. 

ఈ తీర్పు వెలువడిన 11 ఏళ్ల తర్వాత సుమోటోగా కేసుపై పునర్విచారణ జరపాలని మద్రాస్ హైకోర్టు జడ్జ్ జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలకు వ్యతిరేకంగా కేసులు నమోదు చేయడం, ఆ తర్వాత ప్రతిపక్షాలు అధికారంలోకి రాగానే కేసులను రద్దు చేయడం వంటివి పరిపాటిగా మారాయని జస్టిస్ ఆనంద్ అన్నారు. ఏసీబీ అధికారుల వైఖరి కూడా అధికార పక్షాలకు అనుకూలంగా ఉంటోందని విమర్శించారు. దిగువ కోర్టుల తీర్పుపై 12 ఏళ్లు గడిచినా పునర్విచారణ జరిపేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని... ఆ ఉత్తర్వులకు అనుగుణంగానే పన్నీర్ సెల్వం కేసుపై పునర్విచారణ జరుపుతామని తెలిపారు.
Go Back to Shorts
Panneerselvam
Corruption Case
Madras High Court

More Telugu News