Congress: తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్.. ఈ నెల 16, 17న హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాల ఏర్పాటు

CWC meeting to be held in Hyderabad on 16 and 17th of this month
  • 17న విలీన దినోత్సవానికి హాజరవనున్న సోనియా
  • అక్టోబరు 2 నుంచి నెల పాటు కీలక నేతల బస్సుయాత్ర
  • అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన అగ్రనేతలు
తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. అధికార బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో పార్టీ కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగనుంది. ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌ వేదికగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరపాలని నిర్ణయించింది. సీడబ్ల్యూసీ కార్యవర్గ పునర్‌ వ్యవస్థీకరణ అనంతరం జరుగుతున్న తొలి సమావేశం ఇదే కానుంది. ఈ సమావేశం హైదరాబాద్‌లో జరపాలని తెలంగాణ పీసీసీ ప్రతిపాదించింది. సమావేశంతో రాష్ట్ర కాంగ్రెస్ లో జోష్ వస్తుందని భావించింది. దీనికి అధిష్ఠానం ఒప్పుకుంది. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీతో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా 39 మంది వర్కింగ్‌ కమిటీ సభ్యులు ఈ సమావేశం కోసం రాష్ట్రానికి రానున్నారు. అగ్రనేతల రాకతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ రానుంది. 

మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశం చివరి రోజు సెప్టెంబరు 17న హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు కావడంతో ఆ వేడుకల్లో సోనియాగాంధీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సమావేశాలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సైరన్ మోగించనుంది. మొత్తం 100 మందికి పైగా వివిధ రాష్ట్రాల కాంగ్రెస్‌ ముఖ్య నేతలు తెలంగాణవ్యాప్తంగా పర్యటిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. అలాగే, అక్టోబరు 2 నుంచి టీపీసీసీ బస్సు యాత్ర చేపట్టింది. ఈ నెల రోజుల పాటు జరిగే ఈ యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, టి.జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితర కీలక నేతలంతా పాల్గొనున్నారు.
Congress
CWC
Hyderabad
brs
Sonia Gandhi
Rahul Gandhi

More Telugu News