Bengaluru: క్యాష్ ఆన్ డెలివరీలో సరికొత్త మోసం

Bengaluru Police Arrested inter state gang selling fake goods to consumers on cash on delivery basis
  • నాసిరకం వస్తువులను అంటగడుతున్న సైబర్ కేటుగాళ్లు
  • ఇటు కస్టమర్లను.. అటు కంపెనీలను మోసగిస్తున్న వైనం
  • బెంగళూరులో ఓ ముఠాను పట్టుకున్న పోలీసులు
ఆన్ లైన్ షాపింగ్ చేసేటపుడు క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకోవడమే మేలని చాలామంది నమ్మకం.. మనం ఆర్డర్ చేసిన వస్తువు ఇంటికి వచ్చినప్పుడే డబ్బు చెల్లిస్తాం కాబట్టి మోసానికి పెద్దగా ఆస్కారం లేదని భావిస్తుంటారు. అయితే, ఇందులోనూ మోసానికి ఆస్కారం ఉందని బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. మీరు ఆర్డర్ చేసిన వస్తువులకు నకిలీ, నాసిరకం వస్తువులను పంపించి మోసం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా పలువురు కస్టమర్లను మోసం చేసిన అంతర్రాష్ట్ర ముఠాను తాజాగా అరెస్టు చేసినట్లు వివరించారు.

మోసం జరిగేదిలా..
పేరున్న పెద్ద ఈ కామర్స్ కంపెనీలు తమ కస్టమర్ల ఆర్డర్లను పూర్తిచేసే పనిని ఔట్ సోర్సింగ్ కు అప్పగిస్తాయి. తమ సైట్ లో కస్టమర్ ఆర్డర్ చేసిన వస్తువును, దానిని చేర్చాల్సిన చిరునామాను ఇతర చిన్న కంపెనీలకు అందిస్తాయి. ఆర్డర్ వివరాల ఆధారంగా కస్టమర్ కోరిన వస్తువును ఈ కంపెనీలు పంపిస్తుంటాయి. ఈ క్రమంలో కస్టమర్ల వివరాలు కానీ, ఆర్డర్ చేసిన వస్తువుల వివరాలు కానీ బహిర్గతం చేయొద్దని ఒప్పందం ఉంటుంది. ఔట్ సోర్సింగ్ కంపెనీల నుంచి కస్టమర్ల వివరాలను తస్కరించడమో లేక ఆయా కంపెనీల సిబ్బందికి పెద్ద మొత్తంలో సొమ్ము ఆశ చూపడం ద్వారానో సైబర్ నేరస్థులు సేకరిస్తున్నారు.

అనంతరం కస్టమర్లు ఆర్డర్ చేసిన వస్తువులకు సంబంధించి నాసిరకం, నాణ్యతలేని వస్తువులను కొరియర్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ లో డెలివరీ టైమ్ కన్నా ముందే ఆర్డర్ చేసిన వస్తువు ఇంటికి వస్తుంది. ఆ వస్తువును అప్పగించేసి డబ్బు తీసుకుని వెళతారు. అయితే, ఈ కామర్స్ కంపెనీ సైట్ లో మీరు చూసిన వస్తువుకు, మీరు అందుకున్న వస్తువుకు మధ్య నాణ్యత విషయంలో భారీగా తేడా ఉంటుంది.

నాసిరకం వస్తువు అందుకున్నామంటూ కస్టమర్లు వాటిని తిప్పి పంపడంతో ఈ కామర్స్ కంపెనీ మరో వస్తువును పంపడమో లేక ఆ మొత్తం తిరిగివ్వడమో చేయాల్సి వస్తోంది. దీంతో ఇటు కస్టమర్లు, అటు కంపెనీలు మోసపోతున్నాయి. ఈ మోసం కారణంగా 2021 జూన్ నుంచి ఇప్పటి వరకు రూ.70 లక్షల నష్టం వాటిల్లిందంటూ ఓ బడా కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిఘా పెట్టిన పోలీసులు.. బెంగళూరులో అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ ముఠాలోని 21 మంది సభ్యులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 26.95 లక్షలు నగదు, 11 మొబైల్‌ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌ డిస్క్‌లను  స్వాధీనం చేసుకున్నామని డీసీపీ శివప్రకాశ్ పేర్కొన్నారు.
Bengaluru
fake goods
consumers
cash on delivery
Police Arrest

More Telugu News