Indigo: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • కొచ్చి నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానం
  • సీఐఎస్ఎఫ్ కంట్రోల్ రూంకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్
  • వెంటనే ప్రయాణికులను కిందికి దించేసిన అధికారులు
  • బాంబు లేదని తేలిన వైనం
Bomb threat for Indigo plane

కొచ్చి-బెంగళూరు ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఇండిగో విమానం కొచ్చి ఎయిర్ పోర్టులో టేకాఫ్ కు సిద్ధమవుతుండగా, గుర్తు తెలియని వ్యక్తి నుంచి విమానాశ్రయానికి ఫోన్ కాల్ వచ్చింది. విమానంలో బాంబు ఉందని తెలిపాడు. ఆ సమయంలో విమానంలో 139 మంది ప్రయాణికులు ఉన్నారు. 

బెదిరింపు ఫోన్ కాల్ పై వెంటనే స్పందించిన అధికారులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఇండిగో విమానాన్ని నిలిపి వేశారు. అందులోని ప్రయాణికులందరినీ కిందికి దించేశారు. సీఐఎస్ఎఫ్ క్విక్ రియాక్షన్ టీమ్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, కేరళ పోలీసులు విమానంలో క్షుణ్నంగా తనిఖీలు చేశారు. ప్రయాణికుల లగేజిని కూడా సోదా చేశారు. 

ఎలాంటి బాంబు కనిపించకపోవడంతో హమ్మయ్య అనుకున్నారు. ఉదయం 10.30 గంటలకు బయల్దేరాల్సిన ఇండిగో విమానం ఈ బెదిరింపు కాల్ వల్ల మధ్యాహ్నం 2.24 గంటలకు టేకాఫ్ తీసుకుంది. 

కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొచ్చి ఎయిర్ పోర్టులోని సీఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్ కు వచ్చిన ఫోన్ కాల్ ను విశ్లేషించే పనిలో పడ్డారు. సదరు వ్యక్తి ఇంటర్నెట్ కాల్ చేయడంతో ఐపీ అడ్రస్ ఆధారంగా కాల్ ఎక్కడ్నించి వచ్చింది, ఎవరు చేశారనేది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

More Telugu News