Revanth Reddy: ప్రజాగర్జన సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, ప్రకటించిన రేవంత్ రెడ్డి

  • పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు చేసిందన్న టీపీసీసీ చీఫ్
  • కేసీఆర్ పాలనలో దళితులు, గిరిజనులు మోసపోయారని విమర్శ
  • కాంగ్రెస్ వచ్చాక రిజర్వేషన్లు పెంచుతామని హామీ
Congress SC and ST declaration in Praja Garjana Sabha

పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ కాంగ్రెస్ నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం చేవెళ్ల ప్రజాగర్జన సభలో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ పాలనలో దళితులు, గిరిజనులు మోసపోయారన్నారు. వీరిని ఆదుకునేందుకే నేడు ఖర్గే ఇక్కడకు వచ్చారన్నారు. తాము ఎస్సీ వర్గీకరణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు మూడు కార్పోరేషన్ల చొప్పున ఏర్పాటు చేస్తామన్నారు. చేవెళ్ల గడ్డమీద నుండి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు పెంచేలా నిర్ణయం తీసుకుంటామన్నారు.

అంబేడ్కర్ అభయ హస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తామని, కాంట్రాక్ట్ పనుల్లో రిజర్వేషన్ ఇస్తామని, ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు ఇస్తామని రేవంత్ ఈ సందర్భంగా ప్రకటించారు. రాష్ట్రంలో ఐదు ఐటీడీఏలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాస్ అయితే రూ.10వేలు, ఇంటర్ పాస్ అయితే రూ.15వేలు, డిగ్రీ పూర్తిచేస్తే 25 వేలు, పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు రూ.1 లక్ష ఇస్తామని చెప్పారు. ప్రతి మండలంలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామని, గ్రాడ్యుయేషన్ చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత హాస్టల్ ఏర్పాటు చేస్తామన్నారు. పోడు భూముల పట్టాలిస్తామని హామీ ఇచ్చారు.

సోనియా గాంధీ సూచనల మేరకు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. దళిత, గిరిజనులను ఆదుకోవడానికే ఈ ఎస్సీ డిక్లరేషన్ అన్నారు. కాగా, అంతకుముందు, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.

More Telugu News