Bhanuprakash Reddy: టీటీడీ నియమ నిబంధనలను జగన్ గాలికొదిలేశారు: భానుప్రకాశ్ రెడ్డి

  • ప్రభుత్వం ప్రకటించిన టీటీడీ బోర్డు సభ్యులపై విమర్శలు
  • లిక్కర్ స్కామ్ లో ఉన్న వ్యక్తిని బోర్డు సభ్యుడిగా ఎలా చేస్తారని భానుప్రకాశ్ ప్రశ్న
  • టీటీడీ అంటే వైఎస్ జగన్ దేవస్థానమా? అని ప్రశ్న
Jagan not caring TTD rules says Bhanuprakash Reddy

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన టీటీడీ బోర్డుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరి పేర్లపై ప్రతిపక్షాలు విమర్శలను ఎక్కుపెట్టాయి. ఏపీ బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ... ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డిని బోర్డు సభ్యుడిగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. టీటీడీ బోర్డు నియామకాలకు సంబంధించిన నియమ నిబంధనలను ముఖ్యమంత్రి జగన్ గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. జగన్ సీఎం అయిన వెంటనే టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని, 81 మంది సభ్యులను బోర్డు సభ్యులుగా నియమించారని విమర్శించారు. అయితే కోర్టు ఆదేశాలతో ఆ సంఖ్యను 51కి కుదించారని చెప్పారు. హిందూమత సంప్రదాయాలను పాటించే వారినే పాలకమండలిలో నియమించాలని అన్నారు. 

టీటీడీ అంటే వైఎస్ జగన్ దేవస్థానమా? అని భానుప్రకాశ్ ప్రశ్నించారు. శ్రీవారి భక్తులను కలుపుకుని రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. వైసీపీ నేతలు, పోలీసులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. అడ్డదారుల్లో టీటీడీ నియామకాలను చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారికి వచ్చే ఆదాయాన్ని హిందూ ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఖర్చు చేయాలని సూచించారు. 

More Telugu News