BOat: ‘బోట్’ నుంచి స్మార్ట్ రింగ్.. పలు ప్రత్యేకతలు!

  • ఆగస్ట్ 28 నుంచి కొనుగోళ్లకు అవకాశం
  • దీని ధర రూ.8,999
  • హార్ట్ రేట్, టెంపరేచర్ తెలుసుకునే ఫీచర్లు
  •  స్త్రీల కోసం మెన్సస్ ట్రాకర్ సదుపాయం
BOat smart ring sales starts from 28th August impressive features

స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచెస్, స్మార్ట్ ఇయర్ బడ్స్.. ఇప్పుడు స్మార్ట్ రింగ్. గ్యాడ్జెట్లు అన్నీ స్మార్ట్ దనాన్ని సంతరించుకుంటున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ ఆడియో, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ‘బోట్’ స్మార్ట్ రింగ్ ను తీసుకొచ్చింది. దీన్ని గత నెలలోనే ఆవిష్కరించినప్పటికీ, ధర, ఎప్పటి నుంచి విక్రయించేది నాడు వెల్లడించలేదు. ఈ నెల 28 నుంచి అమ్మకాలు మొదలవుతాయని బోట్ తాజాగా ప్రకటించింది.

సిరామిక్, మెటల్ తో ఈ స్మార్ట్ రింగ్ ను తయారు చేశారు. తక్కువ బరువుతో ఉంటుందిది. ఈ రింగ్ లోని స్మార్ట్ టెక్నాలజీ సాయంతో ధరించిన వారి ఆరోగ్యాన్ని ట్రాక్ చేయవచ్చు. యాక్సిస్ మోషన్ సెన్సార్లతో, 5ఏటీఎం సర్టిఫికేషన్ తో వస్తుంది. నీరు, చెమట నుంచి దీనికి రక్షణ ఉంది.

గుండె స్పందనల రేటు, శరీర ఉష్ణోగ్రత, నిద్ర తీరు, రక్తంలో ఆక్సిజన్ శాచురేషన్ ఎంత (ఎస్పీవో2) ఉందో స్మార్ట్ రింగ్ చెప్పేస్తుంది. స్త్రీలల్లో నెలసరి సైకిల్ ట్రాక్ చేసుకునే ఫీచర్ కూడా ఉంది. స్మార్ట్ టచ్ కంట్రోల్స్ తో పనిచేస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే ఏడు రోజుల వరకు పనిచేస్తుంది. స్మార్ట్ వాచ్ లో మాదిరే, ఈ స్మార్ట్ రింగ్ నుంచి కూడా ఆడియో ట్రాక్ లను ప్లే, పాస్ చేసుకోవచ్చు. ఫొటోలను క్లిక్ చేయవచ్చు. 

అత్యవసర సమయాల్లో సాయానికి వీలుగా ఎస్ వోఎస్ సపోర్ట్ కూడా ఉంటుంది. 17.3 ఎంఎం, 19 ఎంఎం, 20.6ఎంఎం డయామీటర్ సైజుల్లో ఇది లభిస్తుంది. దీని ధర రూ.8,999. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, బోట్ అధికారిక వెబ్ పోర్టళ్లపై ఈ నెల 28న మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటుంది. మరో పోటీ సంస్థ నాయిస్ సైతం ‘లూనా రింగ్’ను ప్రకటించగా, అంది ఇంకా మార్కెట్లో అందుబాటులో లేదు.

More Telugu News