BCCI president: పాకిస్థాన్ కు వెళ్లనున్న బీసీసీఐ బాస్.. ముంబై దాడుల తర్వాత మొదటిసారి

  • బీసీసీఐ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కు పీసీబీ ఆహ్వానం
  • సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు పాక్ లో పర్యటన
  • లాహోర్ లో వీరికి అధికారిక విందు
BCCI president to visit Pakistan for first time since Mumbai attacks Roger Binny Rajeev Shukla to watch Asia Cup games

ఆసియాకప్ 2023 సందర్భంగా బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పాకిస్థాన్ ను సందర్శించనున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ పంపిన ఆహ్వానాన్ని వీరు మన్నించారు. 2008 ముంబైపై ఉగ్రదాడుల తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత బీసీసీఐ ప్రతినిధి ఒకరు పాకిస్థాన్ సందర్శిస్తుండడం ఇదే మొదటిసారి కానుంది. 

రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లా సెప్టెంబర్ 4న లాహోర్ చేరుకుంటారు. 7వ తేదీ వరకు ఉండి ఆసియాకప్ మ్యాచ్ లను వీక్షించనున్నారు. ‘‘తొలుత సెప్టెంబర్ 2న శ్రీలంకలో జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ను చూసేందుకు బిన్నీ, రాజీవ్ శుక్లాతోపాటు, బీసీసీఐ సెక్రటరీ జైషా వెళ్లనున్నారు. అక్కడి నుంచి సెప్టెంబర్ 3న భారత్ చేరుకుంటారు. తిరిగి సెప్టెంబర్ 4న రోడ్డు మార్గంలో బిన్నీ, శుక్లా వాఘా సరిహద్దు ద్వారా లాహోర్ కు వెళతారు’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. లాహోర్ లోని గవర్నర్ హౌస్ లో సెప్టెంబర్ 4న వీరికి అధికారిక విందు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆసియా కప్ మ్యాచ్ లు తొలుత పాకిస్థాన్ లో, ఆ తర్వాత శ్రీలంకలో జరగనుండడం తెలిసిందే.

More Telugu News