TPCC: కాంగ్రెస్ టికెట్ కోసం వెల్లువలా దరఖాస్తులు

  • 119 టికెట్ల కోసం 1020 అప్లికేషన్లు
  • ఒక్కో నియోజకవర్గం నుంచి సగటున తొమ్మిది
  • స్క్రూటినీ చేయనున్న పార్టీ ఎలక్షన్ కమిటీ
TPCC Recieved Around 1020 applications for 119 assembly seats

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు చాలామంది నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. పార్టీ టికెట్ కోసం గాంధీ భవన్ కు దరఖాస్తులు పెట్టుకున్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉండగా.. కాంగ్రెస్ టికెట్ కోసం మొత్తం 1020 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే సగటున ఒక్కో నియోజకవర్గం నుంచి తొమ్మిది మంది టికెట్ ఆశిస్తున్నారు. పార్టీ టికెట్ కోసం ఒక్కో అభ్యర్థి రెండు మూడు నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకోగా.. కొన్నిచోట్ల ఒకే నియోజకవర్గ టికెట్ కోసం కుటుంబ సభ్యులే పోటాపోటీగా దరఖాస్తులు సమర్పించారు. కాగా, ఈ దరఖాస్తులను టీపీసీసీ ఎలక్షన్ కమిటీ సోమవారం స్క్రూటిని చేసి స్కీనింగ్ కమిటీకి అర్హులైన అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తుంది. ఆపై అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడతారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న నేతల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 18 నుంచి 25 వరకు అప్లికేషన్లు తీసుకోగా.. మొత్తం 1020 దరఖాస్తులు వచ్చినట్లు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. ఇందులో ఇల్లందు నియోజకవర్గం టికెట్ కోసం ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. కొడంగల్ నియోజకవర్గం టికెట్ కోసం అతి తక్కువ మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. నాగార్జున సాగర్ టికెట్ కోసం జానారెడ్డి కొడుకులు దరఖాస్తు పెట్టుకున్నారు. కరీంనగర్ అసెంబ్లీ టికెట్ కోసం తల్లీ కొడుకులు (కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు , రితేశ్ రావు), ముషీరాబాద్ టికెట్ కోసం తండ్రీ కొడుకులు (అంజన్ కుమార్ యాదవ్, అనీల్ కుమార్ యాదవ్), ఆందోల్ సెగ్మెంట్ కోసం తండ్రీకూతుళ్లు (దామోదర రాజనర్సింహ, త్రిశాల) దరఖాస్తు చేసుకున్నారు. 


ప్రముఖ నేతల దరఖాస్తులు..
రేవంత్ రెడ్డి –  కొడంగల్
భట్టి విక్రమార్క–  మధిర
ఉత్తమ్ కుమార్ రెడ్డి – హుజూర్ నగర్
కోమటిరెడ్డి వెంకటరెడ్డి – నల్లగొండ
జీవన్ రెడ్డి – జగిత్యాల
షబ్బీర్ అలీ – కామారెడ్డి
కొండా సురేఖ – వరంగల్ తూర్పు
పొంగులేటి శ్రీనివాసరెడ్డి – పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం
శ్రీధర్ బాబు – మంథని
జగ్గారెడ్డి – సంగారెడ్డి
మధు యాష్కీ – ఎల్బీ నగర్
పొన్నాల లక్ష్మయ్య – జనగాం
సీతక్క – ములుగు
చిన్నారెడ్డి – వనపర్తి
అద్దంకి దయాకర్ – తుంగతుర్తి
ప్రేమ్ సాగర్ రావు – మంచిర్యాల
పొన్నం ప్రభాకర్ – హుస్నాబాద్
సర్వే సత్యనారాయణ – కంటోన్మెంట్
బలరాం నాయక్ – మహబూబాబాద్

More Telugu News