అక్కడ టీడీపీ డిపాజిట్ గల్లంతవడం ఖాయం!: విజయసాయిరెడ్డి
- తండ్రీకొడుకులు తిరిగిన ప్రతి నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోతుందన్న వైసీపీ ఎంపీ
- వీరి హింసను, రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శ
- బాకా మీడియా పబ్లిసిటీ తప్ప మరో ప్రయోజనం లేదని తేలిందని వ్యాఖ్య
యువగళం, ప్రాజెక్టుల యాత్ర పేరుతో తండ్రీకొడుకులు తిరిగిన ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీకి డిపాజిట్ గల్లంతవడం ఖాయమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయాలకు చీడపురుగులై, వీళ్ల నోటి దురుసుతనం, అరాచకాలు, హింసను రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. బాకా మీడియా పబ్లిసిటీ తప్ప ప్రయోజనం లేదని తేలిపోయిందన్నారు.
అంతకుముందు, నారా లోకేశ్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. మాట్లాడితే మా తాతగారు ఎన్టీఆర్... అదీ, ఇదీ అంటున్నావని, అసలు పాదయాత్ర ఒకచోట ముగిస్తే మరుసటిరోజు తెల్లారి మరోచోట నుంచి ఎలా మొదలెడుతున్నావో చెప్పాలని ట్వీట్‌లో ప్రశ్నించారు. నిద్దట్లో ఏమైనా నడిచే అలవాటు ఉందా? అని అడిగారు. భవిష్యత్తులో ఏమి చేస్తావో చెప్పలేవు... నోరు విప్పితే బనియన్లు, కట్ డ్రాయర్లంటావు... కనీసం ప్రజల సమస్యలైనా వినడం నేర్చుకో లోకేశ్ అని ఎద్దేవా చేశారు.