Bomb: విమానంలో బాంబు ఉందంటూ కలకలం రేపిన పదేళ్ల బాలుడు

  • ముంబయి విమానాశ్రయానికి బెదిరింపు కాల్
  • ఓ విమానంలో బాంబు ఉందని, అందరినీ కాపాడాలని ఫోన్ కాల్
  • ఉరుకులు పరుగులు పెట్టిన పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ 
  • తనిఖీల అనంతరం బాంబు లేదని తేల్చిన వైనం
  • ఫోన్ చేసిన బాలుడికి మతిస్థిమితం లేదని గుర్తించిన పోలీసులు
Ten years old boy phone calls Mumbai Airport and said there is a bomb in plane

విమానంలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ రావడం, భద్రతా సిబ్బంది, బాంబు డిస్పోజల్ స్క్వాడ్లు ఉరుకులు పరుగులు పెట్టడం... కొన్నిసార్లు అవి ఉత్తుత్తి బెదిరింపు కాల్స్ అని తేలడం తెలిసిందే. అదే రీతిలో, ముంబయి విమానాశ్రయానికి కూడా ఇలాంటి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. 

ఇక్కడి ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని ఓ విమానంలో బాంబు ఉందన్నది ఓ ఫోన్ కాల్ సారాంశం. ప్రమాదం జరగకుండా చూడాలని పోలీసులను ఆ వ్యక్తి కోరాడు. దాంతో పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సాయంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. చివరికి బాంబు లేదని తేల్చారు. 

ఇక, ఫోన్ కాల్ ఎక్కడ్నించి వచ్చిందన్నది కూపీ లాగితే... మహారాష్ట్రలోని సతారా జిల్లా నుంచి అని తేలింది. ఆ కాల్ చేసింది కూడా ఓ పదేళ్ల బాలుడు అని గుర్తించారు. అతడికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతోనే ఈ విధంగా ఉత్తుత్తి కాల్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 

ఏదేమైనా, ఆ కాసేపు ముంబయి విమానాశ్రయంలో హైటెన్షన్ నెలకొంది. ప్రయాణికులు, విమాన సిబ్బంది ఉద్విగ్న క్షణాలను అనుభవించారు. బాంబు లేదని తెలియడంతో అందరూ హమ్మయ్య అనుకున్నారు.

More Telugu News