Telangana: బీటెక్‌కు మొహం చాటేసిన విద్యార్థులు.. తెలంగాణలో భారీగా మిగిలిన సీట్లు

  • మొదటి సంవత్సరం కౌన్సెలింగ్ పూర్తి
  • 16,296 సీట్లు ఖాళీగా ఉన్నట్లు అధికారుల వెల్లడి
  • భర్తీ అయిన సీట్లు 69 వేలు 
Over 16k engineering seats leftover in Telangana

తెలంగాణలో బీటెక్ మొదటి సంవత్సరంలో ఏకంగా 16 వేల సీట్లు మిగిలిపోయాయి. ఎంసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ తో బీటెక్‌ ఫస్టియర్‌ ప్రవేశాల ప్రక్రియ ముగిసిందని అధికారులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 178 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో మొత్తం 69,375 (80.97%) సీట్లు నిండినట్లు వెల్లడించారు. ఇంకా 16, 296 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటిలో అత్యధికంగా సీఎస్‌ఈ, ఐటీ కోర్సుల్లో 5,723 సీట్లు భర్తీ కాలేదన్నారు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌లో 4,959 సీట్లు, సివిల్‌, మెకానిక్‌లలో మరో 5,156 సీట్లు మిగిలిపోయాయని తెలిపారు. 

ప్రైవేట్‌ కాలేజీల్లో 14,511 సీట్లు మిగిలిపోగా..  ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో 289 సీట్లు, యూనివర్సిటీ కాలేజీల్లో 1,496 సీట్లు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. స్పాట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా కాలేజీలే కొన్నింటిని భర్తీ చేసుకోనున్నాయి. అయినప్పటికీ ఈ ఏడాది భారీగా సీట్లు మిగిలిపోనున్నాయి. కాగా, స్పెషల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 29లోపు ఫీజు చెల్లించి, గడువు తేదీలోపు కాలేజీల్లో రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు.

More Telugu News