Yevgeny Progozhin: అంతుబట్టని వ్యవహారంలా మారిన ప్రిగోజిన్ విమాన ప్రమాదం

  • ఇటీవల పుతిన్ పై తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్ 
  • అతడి భవితవ్యంపై అప్పుడే అనుమానాలు!
  • ఇప్పుడు అనుమానాస్పద రీతిలో విమాన ప్రమాదం
  • విమానం కూలిపోవడంపై పలు సందేహాలు!
Mystery behind Prigozhin death in a plane crash

రష్యా రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి వాగ్నర్ గ్రూప్ అధినేత యెవెగెనీ ప్రిగోజిన్ మరణం ఆశ్చర్యం కలిగించదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై తిరుగుబాటు చేసిన క్షణమే, అతడికి మూడిందన్న వ్యాఖ్యలు వినిపించాయి. 

ఇప్పుడు విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించడంతో, "ఎప్పుడో జరగాల్సింది... కాస్త ఆలస్యమైందంతే" అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా, వాగ్నర్ గ్రూపు అధినేతగా, పుతిన్ అంతరంగికుడిగా రష్యా ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మృత్యువాత పడడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆ విమానం ఎందుకు కూలిపోయిందన్నది ఇప్పటివరకు తెలియరాలేదు.  

అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ లో దీనిపై ఓ కథనం వచ్చింది. ప్రమాదం జరిగిన రోజున ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానం బ్రెజిల్ తయారీ ఎంబ్రాయర్-600 ఎగ్జిక్యూటివ్ జెట్. ప్రమాదం జరిగిన చివరి 30 సెకన్ల ముందు కూడా ఈ విమానం రాడార్ పై కనిపించింది. అంత తక్కువ వ్యవధిలో ఆ విమానానికి ఏం జరిగిందన్నది అంతుబట్టని వ్యవహారంలా మారింది. 

ఫ్లైట్ రాడార్24 అనే సంస్థకు చెందిన ఇయాన్ పెచెనిక్ దీనిపై స్పందిస్తూ, గాల్లో 28 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా 8 వేల అడుగులకు జారిపోయింది. ఇదంతా కొన్ని సెకన్లలోనే జరిగిపోయింది... ఈ పరిణామం తర్వాత వారు విమానాన్ని అదుపు చేయలేకపోయి ఉండొచ్చు అని అతడు అభిప్రాయపడ్డాడు. 

విమానం నిట్టనిలువుగా కిందికి దూసుకొచ్చి ఉంటుందని మరికొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే వీలున్న క్షిపణి ఈ విమానాన్ని తాకిందా అనే సందేహాలు రష్యా మీడియాలోని కొన్ని అంతర్గత వర్గాల నుంచి వెలువడ్డాయి. ఈ ఘటనపై రష్యా ప్రభుత్వం క్రిమినల్ విచారణకు ఆదేశించింది. విమానం ఎందుకు కూలిపోయిందన్న దానికి కారణం కనుక్కోవడమే ఈ విచారణ ముఖ్య ఉద్దేశం. 

బ్రెజిల్ విమాన తయారీ సంస్థ ఎంబ్రాయర్ ఎస్ఏ కూడా దీనిపై స్పందించింది. ప్రమాదానికి గురైన విమానానికి ఇటీవలి సంవత్సరాల్లో తాము ఎలాంటి సర్వీసింగ్, సాంకేతిక పరమైన మద్దతు అందించలేదని స్పష్టం చేసింది. ఇటీవల తిరుగుబాటు అనంతరం ప్రిగోజిన్ 13 మంది ప్రయాణించే వీలున్న ఈ లగ్జరీ జెట్ లోనే బెలారస్ వెళ్లినట్టు భావిస్తున్నారు.

More Telugu News