VV Lakshminarayana: ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా... ఎక్కడ్నించి అనేది త్వరలో చెబుతా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • గత ఎన్నికల్లో ఓటమిపాలైన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
  • జనసేన ఎంపీ అభ్యర్థిగా విశాఖ నుంచి పోటీ పడిన వైనం 
  • వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై తాజాగా స్పష్టతనిచ్చిన లక్ష్మీనారాయణ  
VV Lakshminarayana says he will contest in next elections as an independent candidate

రాజకీయాలపై ఆసక్తితో పోలీస్ శాఖ నుంచి స్వచ్ఛంద రిటైర్మెంట్ ప్రకటించిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ గత ఎన్నికల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ తరఫున విశాఖ లోక్ సభ స్థానానికి పోటీ చేసిన ఆయనకు నిరాశ తప్పలేదు.

 ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ గెలవగా, లక్ష్మీనారాయణ మూడో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల తర్వాత ఆయన జనసేన పార్టీని వదిలి బయటికి వచ్చారు. 

అయితే, వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా? మళ్లీ విశాఖ నుంచి బరిలో దిగుతారా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన తన రాజకీయ భవిష్యత్ పై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. 

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీలో చేరబోనని, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని వెల్లడించారు. ఎక్కడ్నించి అనేది ఇంకా నిర్ణయించుకోలేదని, త్వరలోనే చెబుతానని వివరించారు. 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ ప్రస్థానం చూస్తే విశాఖ కేంద్ర బిందువుగానే ఆయన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ వ్యవహారంలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 

స్టీల్ ప్లాంట్ కు మేలు జరిగితే అదే చాలు అనే ఉద్దేశంతో ఆయన ఆఖరికి కేఏ పాల్ వంటి నేతను కూడా కలిశారు. ఓ దశలో స్టీల్ ప్లాంట్ ను కొనడానికి బిడ్ దాఖలు చేసి, క్రౌడ్ ఫండింగ్ ద్వారా మూలధన నిధుల సేకరణకు కూడా నడుం బిగించారు. ఈ నేపథ్యంలో, ఆయన విశాఖను దాటి ఇతర ప్రాంతాల్లో పోటీ చేయకపోవచ్చని తెలుస్తోంది.

More Telugu News