AP High Court: కౌలు చెల్లింపు అంశంపై.. సీఆర్డీఏ, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

  • తమకు వార్షిక కౌలు చెల్లించేలా ఆదేశాలివ్వాలని రైతుల పిటిషన్
  • కౌలు చెల్లించేందుకు ప్రభుత్వం జీవో ఇచ్చినా.. డబ్బు ఇవ్వలేదని పిటిషనర్ల వాదనలు
  • ప్రభుత్వానికి నోటీసులిచ్చి.. 4 వారాలకు విచారణ వాయిదా వేసిన కోర్టు
ap high court issued notices to ap govt and crda

ఏపీ రాజధాని ప్రాంత రైతులకు కౌలు చెల్లింపు అంశానికి సంబంధించి సీఆర్‌‌డీఏ, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమకు వార్షిక కౌలు చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని పరిరక్షణ సమితి కలిసి హైకోర్టులో పిటిషన్ వేశాయి. దీనిపై ఈ రోజు విచారణ జరిగింది. 

రైతుల తరఫున న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. కౌలు చెల్లింపు విషయంలో జాప్యం జరుగుతున్న విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. రైతులకు కౌలు చెల్లించేందుకు ప్రభుత్వం జీవో ఇచ్చిందని, కానీ కౌలు మాత్రం చెల్లించలేదని తెలిపారు. ఏటా మే నెలలో 31వ తేదీ లోపు చెల్లింపులు జరిగేవని, ఈ ఏడాది ఇప్పటిదాకా ఇవ్వలేదని వివరించారు. మురళీధర్ వాదనలను హైకోర్టు రికార్డు చేసింది. తర్వాత సీఆర్‌‌డీఏ, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

More Telugu News