Lucy Letby: పసికందుల ప్రాణాలు తీసిన బ్రిటన్ నర్సు ఇక జీవితకాలం జైల్లోనే!

  • ఇంగ్లండ్ లో నర్సుగా పనిచేస్తున్న లూసీ లెట్బీ
  • ఏడుగురు పసికందులను హతమార్చిన వైనం
  • కఠినశిక్ష విధించిన న్యాయస్థానం
British nurse who killed toddlers gets whole life imprisonment

ఉత్తర ఇంగ్లండ్ లోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న లూసీ లెట్బీ (33) అనే మహిళ ఏడుగురు శిశువులను చంపేయడం బ్రిటన్ లో సంచలనం సృష్టించింది. లూసీని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను కోర్టు బోనులో నిలిపారు. 

విచారణలో ఆ సైకో నర్సు చేసిన ఘాతుకాలు నిర్ధారణ అయ్యాయి. పసికందులను చంపేయడంపై ఆధారాలతో సహా పోలీసులు నిరూపించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆ కిరాతక నర్సుకు కఠిన శిక్ష విధించింది. ఆమె తన 'జీవితకాలం పాటు జైల్లోనే' ఉండాలని తీర్పు వెలువరించింది. 

బ్రిటన్ లో ఇలా 'చనిపోయేంతవరకు జైల్లోనే' ఉండే శిక్ష ఇప్పటివరకు 70 మందికి విధించగా, వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. 1960లో తన బాయ్ ఫ్రెండ్ ఇయాన్ బ్రాడీతో కలిసి ఐదుగురు చిన్నారులను హత్య చేసిన మైరా హిండ్లే, సీరియల్ కిల్లర్లు రోజ్ వెస్ట్, జొవాన్నా డెన్నెహీ జీవితకాలం పాటు జైల్లో ఉండే శిక్షకు గురయ్యారు. ఇప్పుడు వీరి సరసన నర్సు లూసీ లెట్బీ కూడా చేరింది. 

విచారణ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు లూసీ పైశాచిక మనస్తత్వానికి అద్దం పడతాయి. "ఈ శిశువుల హత్యలు ఎంతో క్రూరంగా, పక్కా ప్రణాళికతో, ఓ లెక్క ప్రకారం చేసినట్టుగా నిర్ధారణ అయింది. నీ మనసులో తీవ్ర ఉన్మాదం, దుర్మార్గం పేరుకుపోయాయి. అసలు, నీలో పశ్చాత్తాపమే లేదు... నువ్వు చేసిన ఘటనలను ఎంతమాత్రం ఉపేక్షించరాదు. ఇక నీవు జీవితమంతా జైల్లోనే గడపాలి" అంటూ ఆ జడ్జి తన తీర్పును వెలువరించారు.

More Telugu News