Kalvakuntla Vidyasagar Rao: మా అబ్బాయికి టికెట్ ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు: కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

  • తనయుడి కోసం సీటు త్యాగం చేసిన విద్యాసాగర్ రావు
  • ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
  • కోరుట్ల అభ్యర్థిగా డాక్టర్ సంజయ్ రావు
  • కేసీఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యాసాగర్ రావు
  • తన కుమారుడ్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటానని వెల్లడి
Kalvakunta Vidyasagar Rao thanked CM KCR

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వచ్చే ఎన్నికల్లో తనయుడి కోసం తన సీటు త్యాగం చేశారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తొలి జాబితా ప్రకటించగా, అందులో విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ సంజయ్ రావు పేరు కూడా ఉంది. దీనిపై విద్యాసాగర్ రావు స్పందించారు. 

"నా అభ్యర్థనను మన్నించి నా కుమారుడికి కోరుట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అత్యధిక మెజారిటీతో మా అబ్బాయిని గెలిపిస్తామని మీకు మాట ఇస్తున్నాను. మీకు మరోసారి ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేశారు. 

కోరుట్ల నియోజకవర్గం కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు కంచుకోట అని చెప్పాలి. ఆయన ఇక్కడ్నించి వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. గ్రామగ్రామాన బీఆర్ఎస్ క్యాడర్ అత్యంత బలంగా ఉంది.

అయితే ఈసారి విద్యాసాగర్ రావు తనయుడు పోటీ చేస్తుండడంతో ఇక్కడి ఫలితంపై ఆసక్తి నెలకొంది. అటు, కాంగ్రెస్, బీజేపీ కూడా ఉత్సాహవంతులైన నేతలనే కోరుట్ల బరిలో దించే అవకాశాలు వినిపిస్తున్నాయి. 

కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తనయుడు జువ్వాడి నరసింగరావు మరోసారి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి ఎవరన్నది ఇంకా స్పష్టత రాలేదు. సురభి నవీన్ రావు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

More Telugu News