Donald Trump: భారతదేశంపై మరోసారి డొనాల్డ్ ట్రంప్ అక్కసు

  • అమెరికా ఉత్పత్తులపై భారత్ పెద్ద మొత్తంలో టారిఫ్‌లు విధిస్తోందన్న ట్రంప్
  • 200 శాతం పన్నులు వేస్తోందని ఆరోపణ
  • మనం పన్నులు కడితే.. వారి నుంచి కూడా వసూలు చేయాల్సిందేనని వ్యాఖ్య
  • తాను అధికారంలోకి వస్తే పరస్పర సమానమైన ప్రతీకార పన్నును విధిస్తానని ప్రకటన
trump rakes up india tax issue says would impose reciprocal tax if voted to power

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఆయన, భారత్ పన్నుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఇండియాపై ప్రతీకార పన్నులు (రెసిప్రోకల్ ట్యాక్స్) విధిస్తామని ప్రకటించారు. 

2019లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. భారత్‌ను ‘టారిఫ్ కింగ్’ అంటూ ట్రంప్ విమర్శించారు. కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారత్ అత్యధిక పన్నులు విధిస్తోందని తాజాగా ఆయన ఆరోపించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే.. ప్రతీకార పన్నులు విధిస్తానని హెచ్చరించారు. 

‘‘హార్లే డేవిడ్సన్ బైక్‌ వంటి అమెరికా ఉత్పత్తులపై భారత్ పెద్ద మొత్తంలో టారిఫ్‌లు విధిస్తోంది. 100, 150, 200 శాతం పన్నులు వేస్తోంది. పన్నులు ఇలా ఉంటే.. మన కంపెనీలు భారతదేశంలో ఎలా వ్యాపారం చేయగలవు?” అని ట్రంప్ ప్రశ్నించారు. మనం అక్కడికి వెళ్లి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే టారిఫ్‌లు ఉండవని, అలా చేయాలనే భారత్ కోరుకుంటోందని చెప్పారు. 

‘‘మన ఉత్పత్తులకు భారత్ 200 శాతం పన్నులు విధిస్తుంటే.. మనం మాత్రం వారి ఉత్పత్తులకు ఎలాంటి సుంకాలు విధించకూడదా? మనం పన్నులు కడితే.. వారి నుంచి కూడా పన్నులు వసూలు చేయాల్సిందే. వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే.. భారత్‌పై పరస్పర సమానమైన ప్రతీకార పన్నును విధిస్తాను” అని ట్రంప్ ప్రకటించారు.

More Telugu News