Amazon Alexa: అమ్మాయిల మ్యాచ్ గురించి అడిగితే... అమెజాన్ అలెక్సా ఇలా చెబుతుందేమిటి?

  • కొన్నాళ్ల కిందట వాయిస్ అసిస్టెంట్ అలెక్సాను ప్రవేశపెట్టిన అమెజాన్
  • అలెక్సా కారణంగా విచిత్ర అనుభవాన్ని ఎదుర్కొన్న బ్రిటన్ మహిళ
  • మహిళల మ్యాచ్ గురించి అడిగితే పురుషుల మ్యాచ్ గురించి సమాచారం
  • మరో ఘటనలో అసలు మ్యాచే లేదంటూ సమాధానం
Amazon Alexa faces sexist remarks

అమెజాన్ ప్రవేశపెట్టిన వాయిస్ అసిస్టెంట్ అలెక్సా ఓ సాంకేతిక విప్లవం అని చెప్పాలి. మన నోటి మాట ఆధారంగా చాలా పనులను ఈ అలెక్సా నిర్వర్తిస్తుంది. అయితే, అనూహ్యరీతిలో అమెజాన్ అలెక్సా లింగ వివక్ష పాటిస్తోందన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. సమానత్వం గురించి పట్టించుకోకుండా, పురుషులకు, మహిళలకు మధ్య తేడా చూపిస్తోందంటూ జొవాన్నే రోడ్డా అనే బ్రిటన్ మహిళ ఆరోపిస్తోంది. 

అసలేం జరిగిందంటే... జొవాన్నే రోడ్డా అనే మహిళ బ్రిటన్ లోని కెంట్ లో మెడ్వే వైద్య కళాశాలలో సైకియాట్రీ విభాగం సీనియర్ లెక్చరర్ గా పనిచేస్తోంది. ఫిఫా మహిళల వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో, ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య మ్యాచ్ గురించి ఆమె అమెజాన్ అలెక్సాను ప్రశ్నించింది. 

ఆ రోజు ఆగస్టు 16... వాస్తవానికి మ్యాచ్ జరుగుతోంది. కానీ, అసలా రోజు ఏ మ్యాచ్ లేదని అలెక్సా జవాబిచ్చింది. దాంతో జొవాన్నే నిర్ఘాంతపోయింది. అంతేకాదు, మహిళల సూపర్ లీగ్ సాకర్ గురించి అడిగినా అమెజాన్ నుంచి అదే తరహాలో సమాధానం వచ్చింది. జొవాన్నే ఆర్సెనల్ మహిళల సాకర్ టీమ్ గురించి అలెక్సాను అడిగింది. అయితే, అలెక్సా మహిళల జట్టు గురించి కాకుండా, పురుషుల జట్టు గురించి చెప్పడం ప్రారంభించిందట.

మొత్తమ్మీద మహిళల ఫుట్ బాల్ గురించి ఏం అడిగినా అలెక్సా జవాబులు ఇలాగే ఉంటున్నట్టు ఆ లెక్చరర్ గుర్తించింది. మహిళల పట్ల అమెజాన్ అలెక్సా వివక్ష ప్రదర్శిస్తోందంటూ ఆమె మండిపడింది. ఈ వివాదం బ్రిటన్ మీడియా ద్వారా అమెజాన్ ను కూడా తాకింది. 

దీనిపై అమెజాన్ అధికార ప్రతినిధి స్పందించారు. ఇది ఓ తప్పిదం (ఎర్రర్)గా భావిస్తున్నామని, దీన్ని వెంటనే సరిదిద్దుతామని తెలిపారు. అలెక్సాను ఓ వినియోగదారు ప్రశ్న అడిగినప్పుడు, అలెక్సా తనకు అందుబాటులో ఉన్న అమెజాన్ సహా వివిధ వనరులు, అనుమతి పొందిన కంటెంట్ సరఫరాదారులు, వెబ్ సైట్ల నుంచి సమాచారం సేకరిస్తుందని వెల్లడించారు. 

అలెక్సా కృత్రిమ మేధను ఉపయోగించుకుని పనిచేసే ఆటోమేటెడ్ వ్యవస్థల సమాహారం అని, సాధ్యమైనంత వరకు సరైన సమాచారం ఇచ్చేందుకే ప్రయత్నిస్తుందని తెలిపారు. కానీ, మహిళల ఫుట్ బాల్ విషయంలో మాత్రం పొరబడిందని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూస్తామని తెలిపారు.

More Telugu News