Khammam District: మరణంలోనూ వీడని ఏడడుగుల బంధం.. ఖమ్మంలో వృద్ధ దంపతుల మృతి

Husband dies within hours of her wifes death in Khammam

  • ఆసుపత్రిలో హార్ట్ ఎటాక్ తో భార్య తుదిశ్వాస
  • ఇంటికి తీసుకొచ్చిన మృతదేహాన్ని చూసి శతాధిక వృద్ధుడి మృతి
  • ఖమ్మంలోని కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామంలో విషాదం

ఏడడుగుల బంధంతో ఒక్కటై ఏడు దశాబ్దాలకు పైగా కలిసి జీవించారు.. చివరకు కలిసే ఈ లోకాన్ని వీడారు. ఒకేరోజు గంటల వ్యవధిలోనే వృద్ధ దంపతులు చనిపోవడం ఖమ్మం జిల్లా చండ్రుపట్ల గ్రామంలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన శతాధిక వృద్ధుడు రాయల యోహాను (112), ఆయన భార్య రాయల మార్తమ్మ (96) ఒకే రోజు మరణించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మార్తమ్మ హార్ట్ ఎటాక్ కారణంగా కన్నుమూయగా.. ఇంటికి తీసుకొచ్చిన మార్తమ్మ మృతదేహం చూసి యోహాను ఊపిరి వదిలాడు. మరణంలోనూ వీడని వారి బంధాన్ని చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన యోహాను, మార్తమ్మలది ప్రేమ వివాహం కావడం విశేషం. సుమారు డెబ్బై ఏళ్ల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట కడవరకూ అన్యోన్యంగా గడిపారని గ్రామస్థులు తెలిపారు. పిల్లలు, మనవలు, మనవరాళ్లు, ముని మనవలు.. ఇలా 50 మందితో పెద్ద కుటుంబం ఏర్పడింది. వందేళ్లు పైబడిన యోహాను ఇటీవల మంచానికే పరిమితమయ్యాడు. వందేళ్లకు దగ్గరపడిన మార్తమ్మ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఇటీవల మార్తమ్మను ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ కన్నుమూసింది. భార్య మరణం తట్టుకోలేక యోహాను కూడా తుదిశ్వాస వదిలాడు. ఈ దంపతుల అంత్యక్రియలకు ఊరుఊరంతా కదిలి వచ్చి కన్నీటితో వారిని సాగనంపింది.

Khammam District
old couple
husband dies after wife
  • Loading...

More Telugu News