Kadiam Srihari: కార్యకర్తల సమావేశంలో భావోద్వేగాలకు లోనైన కడియం శ్రీహరి

Kadiam Srihari gets emotional in party workers meeting
  • స్టేషన్ ఘనపూర్ లో ముఖ్య కార్యకర్తలతో కడియం సమావేశం
  • మళ్లీ పాత ఇంటికి వచ్చినట్టుందని వెల్లడి
  • తాను చెడ్డవాడ్ని కాదని స్పష్టీకరణ
  • వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పరోక్ష వ్యాఖ్యలు
  • నాకు అవకాశం వస్తే మీ ఆశీస్సులు కావాలి అంటూ విజ్ఞప్తి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ లో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భావోద్వేగాలకు గురయ్యారు. 

ఇవాళ ఈ కార్యకర్తలందరినీ చూస్తుంటే సొంత ఇంటికి వచ్చిన భావన కలుగుతోందని అన్నారు. చెడు ప్రవర్తనతో తాను ఏనాడూ కార్యకర్తలకు, ప్రజలకు తలవొంపులు తెచ్చే పరిస్థితి కల్పించలేదని, తాను చెడ్డవాడ్ని కాదని స్పష్టం చేశారు. 

నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను... నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించానే తప్ప, తప్పుడు పనులు ఎప్పుడూ చేయలేదని అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు పెట్టిన రాజకీయ భిక్ష వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, ఈ విషయం చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని కడియం శ్రీహరి తెలిపారు. 

ఈ సందర్భంగా ఆయన తన మనసులో మాటను కార్యకర్తలతో పంచుకున్నారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో, మార్పులు చేర్పులకు అవకాశం ఉండొచ్చని, ఒకవేళ తనకు అవకాశం వస్తే మాత్రం హృదయపూర్వకంగా అందరూ ఆశీస్సులు అందించాలని కడియం విజ్ఞప్తి చేశారు. 

మీ ఎమ్మెల్యే ఎవరు అంటే ఇన్నాళ్లు చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి... నాకు అవకాశం వచ్చి, మీరు దీవెనలు అందిస్తే... ఎమ్మెల్యే ఎవరంటే చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి మాత్రం తీసుకురాను అని వ్యాఖ్యానించారు.
Kadiam Srihari
BRS
Station Ghanpur
Telangana

More Telugu News