Kerala: 5 రోజుల వయసున్న శిశువుకు ఒకేసారి 5 టీకాలు.. ప్రభుత్వ నర్సు నిర్వాకం

5 day old Kerala infant given 5 vaccines instead of one admitted to ICU

  • కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వెలుగు చూసిన ఘటన
  • బీసీజీ టీకా మాత్రమే ఇవ్వాల్సిన శిశువుకు మరో 4 రకాల టీకాలు వేసిన నర్సు
  • తల్లిదండ్రుల ఫిర్యాదుతో నర్సును సస్పెండ్ చేసిన అధికారులు
  • ఘటనపై డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ దర్యాప్తు

కేరళలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన నర్సు దారుణానికి ఒడిగట్టింది. కేవలం అయిదు రోజుల వయసున్న శిశువుకు ఒక టీకా బదులు ఏకంగా 5 రకాల టీకాలు వేసింది. తీవ్ర అస్వస్థతకు లోనైన చిన్నారిని ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పాలక్కాడ్ జిల్లాలో బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది. 

ఆ శిశువు తల్లిదండ్రులు చిన్నారికి బీసీజీ టీకా వేయించేందుకు స్థానికంగా ఉన్న ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. అక్కడ వైద్యుడితో ప్రిస్క్రిప్షన్ రాయించుకుని, దాన్ని నర్సు చారులతకు చూపించారు. బిడ్డకు బీసీజీ టీకాకోసం వచ్చామని చెప్పడంతో నర్సు అకారణంగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తరువాత బిడ్డకు తొలుత ఎడమ భుజంపై బీసీజీ టీకా ఇచ్చిన ఆమె అక్కడితో ఆగక బిడ్డ తొడలపై మరో రెండు రకాల టీకాలు, ఆ తరువాత నోట్లో మరో రెండు టీకాల చుక్కలు వేసింది. 

ఇదంతా గమనించిన తల్లిదండ్రులు వెంటనే డాక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నర్సు బిడ్డకు బీసీజీతో పాటూ పెంటావేలెంట్ పోలియో టీకా, న్యూమోకొక్కల్ టీకా, నోటి ద్వారా తీసుకునే పోలియో టీకాతో పాటూ రోటావైరస్ టీకా వేసినట్టు కూడా బయటపడింది. ఈ దారుణానికి బాధ్యురాలైన నర్సుపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో అధికారులు నిందితురాలిని సస్పెండ్ చేశారు. ఘటనపై డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ దర్యాప్తు ప్రారంభించారు. ఒకేసారి అయిదు టీకాలు తీసుకోవడంతో అనారోగ్యం పాలైన చిన్నారికి ప్రస్తుతం పాలక్కాడ్ జిల్లా ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు.

Kerala
Palakkad District
Crime News
  • Loading...

More Telugu News