CHVM Krishna Rao: ప్రముఖ జర్నలిస్టు 'కృష్ణారావు బాబాయ్' మృతి పట్ల లోకేశ్, బాలకృష్ణ స్పందన

Lokesh and Balakrishna condolences to the demise of senior journalist Krishna Rao
  • అనారోగ్యంతో మృతి చెందిన సీహెచ్ వీఎం కృష్ణారావు
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన నారా లోకేశ్
  • సీనియర్ జర్నలిస్టుగా విశేష సేవలందించారని వెల్లడి
  • కృష్ణారావు మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు అన్న బాలకృష్ణ
సీనియర్ పాత్రికేయుడు, 'కృష్ణారావు బాబాయ్' గా సుపరిచితుడైన సీహెచ్ వీఎం కృష్ణారావు మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకులు సీహెచ్ వీఎం కృష్ణారావు గారి మృతి పట్ల  ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని వెల్లడించారు. 

సమకాలీన అంశాలపై లోతైన విశ్లేషణలు చేసే కృష్ణారావు గారిది నాలుగు దశాబ్దాల పాత్రికేయ ప్రస్థానం అని వివరించారు. తెలుగు, ఇంగ్లీష్ దినపత్రికలలో సీనియర్ జర్నలిస్టుగా విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. జర్నలిస్టులంతా  ప్రేమగా "బాబాయ్" అని పిలుచుకునే కృష్ణారావు గారికి నివాళులు అర్పిస్తున్నానని లోకేశ్ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.

కృష్ణారావు గారి మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు: బాలకృష్ణ

సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు సీహెచ్ వీఎం కృష్ణారావు గారి అకాల మృతి తెలుగు పత్రికా రంగానికి తీరని లోటు అని టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. 

నాలుగు దశాబ్దాలుగా ఆయన వివిధ హోదాల్లో పనిచేసి అందరి చేత "బాబాయ్" అంటూ ఆప్యాయంగా పిలిపించుకునేవాడని తెలిపారు. ప్రతి అంశం పట్ల లోతైన విశ్లేషణ ఆయన ప్రత్యేకత అని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఓ ప్రకటనలో వెల్లడించారు.
CHVM Krishna Rao
Demise
Nara Lokesh
Balakrishna
TDP
Andhra Pradesh

More Telugu News