Burger King: టమాటాలకు కూడా సెలవు అవసరం కదా.. అందుకే తమ మెనూలో కనిపించట్లేదన్న బర్గర్ కింగ్!

  • భారత దేశంలోని తమ ఔట్ లెట్లలో టమాటాల వాడకం బంద్
  • ఇప్పటికే మెక్ డొనాల్డ్స్, సబ్ వే రెస్టారెంట్ల మెనూలో టమాటా కట్
  • వాటి దారిలోనే నడిచిన బర్గర్ కింగ్ రెస్టారెంట్
Tomatoes On Vacation As India Battles Food Inflation says Burger King

టమాటాల రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రముఖ రెస్టారెంట్లు తమ మెనూలో నుంచి వాటిని తొలగిస్తున్నాయి. తొలుత మెక్ డొనాల్డ్స్ ఈమేరకు ప్రకటన చేయగా.. తర్వాత సబ్ వే కూడా అదే దారిలో నడిచింది. మార్కెట్లో నాణ్యమైన టమాటాలకు కొరత ఏర్పడడంతో టమాటాలతో తయారుచేసే పదార్థాలను అందించలేకపోతున్నట్లు పేర్కొంది. తాజాగా బర్గర్ కింగ్ కూడా మెనూలో మార్పులు చేసింది. బర్గర్ సహా ఇతర పదార్థాలలో టమాటాలను ఉపయోగించడంలేదని ప్రకటించింది. నాణ్యమైన టమాటాలు మార్కెట్లోకి రాగానే తిరిగి మెనూలో మార్పులు చేస్తామని తెలిపింది.

ఈ విషయాన్ని బర్గర్ కింగ్ రెస్టారెంట్లలో ఫన్నీగా ప్రదర్శించింది. టమాటాలు వెకేషన్ కు వెళ్లాయని, అందుకే మా రెస్టారెంట్ మెనూలో అవి కనిపించడంలేదని పోస్టర్లు అంటించింది. కస్టమర్లకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలన్నదే తమ ఉద్దేశమని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం మార్కెట్లో టమాటాలకు కొరత ఏర్పడడం, నాణ్యమైన సరుకు రాకపోవడంతో తాత్కాలికంగా వాటిని తమ కిచెన్లలో వాడడం లేదని బర్గర్ కింగ్ ఓ ప్రకటనలో తెలిపింది.

More Telugu News