Nara Lokesh: ఒక ఆంధ్రుడిగా బాధపడుతున్నాను... తలదించుకునే పరిస్థితి ఉంది: నారా లోకేశ్

  • టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడుల వరద అన్న లోకేశ్
  • మొదటి వంద రోజుల్లోనే విశాఖకు ఐటి కంపెనీలను రప్పిస్తామన్న యువనేత
  • తప్పుచేయలేదు కాబట్టే ప్రజల మధ్యన ఉండి పోరాడుతున్నానని వ్యాఖ్య
  • మూడేళ్లలో ప్రజారాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ
  • ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్ల హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ
  • హలో లోకేశ్ కార్యక్రమంలో యువగళం రథసారధి నారా లోకేశ్ 
Nara Lokesh Yuvagalam in Mangalagiri constituency on second day

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. యర్రబాలెంలో నిర్వహించిన హలో లోకేశ్ కార్యక్రమంలో తమ భవిష్యత్తుపై యువత వ్యక్తం చేసిన సందేహాలకు సమాధానం ఇచ్చారు. కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... ... రాష్ట్రానికి పరిశ్రమలు రాబట్టేందుకు తమ వద్ద చంద్రబాబు అనే బ్రాండ్ ఉందని, ఆ బ్రాండ్‌తోనే గతంలో కియా, టీసీఎల్, ఫ్యాక్స్ కాన్, సెల్‌కాన్ వంటి పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ప్రజారాజధాని అమరావతిని పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల్లేక తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్న యువత గళాన్ని సైకో ప్రభుత్వానికి వినిపించేందుకే యువగళం పాదయాత్ర ప్రారంభించినట్లు చెప్పారు. తప్పుచేయలేదు కాబట్టే ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్నానన్నారు. గత నాలుగేళ్లుగా యూనివర్సిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారని ఆరోపించారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యాన్ని తొలగించి, విద్యాప్రమాణాల పెంపుదలకు కృషి చేస్తామన్నారు.

విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన

టీడీపీ అధికారంలోకి వచ్చాక కేజీ నుండి పిజీ వరకు విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన చేస్తామన్నారు. చదువు పూర్తయ్యేటప్పటికి రెడీ టు జాబ్ యువతను తయారు చేస్తామని, పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని అమలుచేసి విద్యార్థుల ఇబ్బందులకు చెక్ పెడతామన్నారు. ఇప్పటికే ఆయా విద్యాసంస్థల్లో ఉండిపోయిన 2 లక్షలమంది సర్టిఫికెట్లను వన్ టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా విద్యార్థులకు అందిస్తామన్నారు. రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాలని నిర్ణయించామని, రాబోయే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇవ్వాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. 

యూపీఎస్సీ మాదిరి ఏపీపీఎస్సీని పటిష్టపర్చి, నిర్ణీత సమయాల్లో ఉద్యోగాలకు పరీక్షలు, ఇంటర్వ్యూలు, నియామకాలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలకు అన్యాయం జరిగితే గన్ కంటే ముందు వస్తానన్న జగన్... రాష్ట్రంలో ప్రతిరోజూ మహిళలపై దాడులు, మానభంగాలు జరుగుతుంటే ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. టీడీపీ వచ్చాక మహిళలవంక చూడాలంటేనే భయపడేలా చట్టాలను కఠినంగా అమలు చేస్తామన్నారు. గత నాలుగేళ్లుగా యువత ఉద్యోగాల్లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయని, ఏపీలో ఉద్యోగాల్లేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ, ప్రయివేటు, స్వయం ఉపాధి రంగాల్లో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మళ్లీ గాడిలో పడుతుందన్నారు. అంతిమంగా పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమన్నారు.

జగన్ విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్

186 రోజులు 7 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 2,500 కి.మీ మేర యువగళం పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్రలో నాకు రెండు స్పష్టంగా కనబడుతున్నాయి..చంద్రబాబు పరిశ్రమలకు, అభివృద్దికి బ్రాండ్ అంబాసిడర్. ఫాక్స్ కాన్, కియా, హెచ్ సీఎల్, టీసీఎల్, అపోలో లాంటి 40 వేల పరిశ్రమలు రావడంతో రాష్ట్రంలోని యువతకు 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. జగన్ విధ్వంసానికి, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక, యువత పక్కరాష్ట్రాలకు తరలిపోతున్నారు. బూమ్ బూమ్, ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ కు జగన్ అంబాసిడర్. దేశంలోనే తొలిసారిగా ఫాక్స్ కాన్ ఏపీకి తీసుకొస్తే దాన్ని తెలంగాణకు తరిమేశారు. అత్యధికంగా రాష్ట్రానికి పన్నులు చెల్లించే అమర్ రాజాను కూడా పక్క రాష్ట్రానికి తరిమారు. రాష్ట్రంలో భారీగా పవర్ కట్ లతో పరిశ్రమలు నష్టపోతున్నాయి. జగన్ పాలనలో మన రాష్ట్రం జోక్ ఆఫ్ ఇండియాగా మారింది. రాష్ట్రాన్ని అందరూ ఎగతాళి చేస్తున్నారు.

యువతకు కావాల్సిందేమిటి?

'యువతకు నేను 5 ప్రశ్నలు వేస్తున్నా.
1. మీకు నెలకు రూ.5 వేల జీతం వచ్చే ఉద్యోగం కావాలా? లేక రూ.50 వేల ఉద్యోగం కావాలా?
2. బూబ్, బూమ్ ప్రెసిడెంట్ మెడల్ లాంటి పరిశ్రమలు కావాలా? లేక కియా, ఫాక్స్ కాన్, హెచ్.సీ.ఎల్. లాంటి పరిశ్రమలు కావాలా?
3. ఏపీ జాబ్ కేపిటల్ ఆఫ్ ఇండియా కావాలా? లేక గంజాయి కేపిటల్ ఆఫ్ ఇండియా కావాలా?
4. ఇక్కడి యువతకు పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు కావాలా? లేక ఉద్యోగాల కోసం ఇక్కడికి వచ్చే రాష్ట్రం కావాలా?
5. రాజధాని లేని రాష్ట్రం కావాలా? లేక అమ్మలాంటి అమరావతి రాజధాని ఉన్న రాష్ట్రం కావాలా?' అని ప్రశ్నించారు.

మార్పు కోరుకుంటే ఓటేయండి

సమాజంలో మనం కోరుకునే మార్పు రావాలనుకునేవారు..ఆ మార్పు ముందు మనలో రావాలని గాంధీ అన్నారని, మీరు ఏ మార్పు కోరుకుంటున్నారో.. ఆ మార్పు కోసమే వచ్చే ఎన్నికల్లో మీరు ఓటేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ఒక ఆంధ్రుడిగా తాను బాధపడుతున్నానని, తలదించుకునే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులు, భూదందాలు జరుగుతున్నాయన్నారు. పక్క రాష్ట్రాల్లో పరిశ్రమలు వస్తున్నాయని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే దారి తప్పిన రాష్ట్రం గాడిలో పడుతుందన్నారు.

యువగళం పాదయాత్ర వివరాలు

* ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2486.3 కి.మీ.

* 187వరోజు  (17-8-2023) యువగళం వివరాలు

* మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి గుంటూరు జిల్లా)

మధ్యాహ్నం

2.00 – యర్రబాలెం డాన్ బాస్కో స్కూలు వద్ద క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

2.30 – డోలాస్ నగర్ లో స్థానికులతో మాటామంతీ.

2.50 – ప్రకాష్ నగర్ లో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.

3.10 – నులకపేటలో స్థానికులతో సమావేశం.

3.55 – సాయిబాబా గుడివద్ద స్థానికులతో మాటామంతీ.

సాయంత్రం

4.05 – సలామ్ సెంటర్ లో స్థానికులతో సమావేశం.

4.25 – గేట్ సెంటర్ లో రెడ్డి సామాజికవర్గీయులతో భేటీ.

4.40 – ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్త్రీశక్తి లబ్ధిదారులతో సమావేశం.

4.50 – అంబేద్కర్ విగ్రహం వద్ద అగ్నికుల క్షత్రియులతో భేటీ.

5.05 – ఉండవల్లి సెంటర్ లో ఎస్టీ సామాజికవర్గీయులతో సమావేశం.

5.30 – ఉండవల్లిలో స్థానికులతో మాటామంతీ.

7.00 – ఉండవల్లిలోని చంద్రబాబునాయుడి గారి నివాసం వద్ద విడిది కేంద్రంలో బస.
******

More Telugu News