Sachin pilot: నా తండ్రి బాంబులు వేసింది నిజమే.. కానీ మణిపూర్ పై కాదు: సచిన్ పైలట్

  • బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయకు కౌంటర్
  • ఎయిర్ ఫోర్స్ పైలట్ గా ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్నాడని వెల్లడి
  • 1971లో తూర్పు పాకిస్థాన్ పై బాంబులు వేశాడని ట్వీట్
My Father Did Drop Bombs says Sachin Pilot

తన తండ్రి రాజేశ్ పైలట్ బాంబులు వేసింది నిజమేనని కాంగ్రెస్ ఎంపీ, రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ అంగీకరించారు. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్విట్టర్ లో చేసిన ఆరోపణలకు పైలట్ కౌంటర్ ట్వీట్ చేశారు. ‘మాలవీయ చెప్పినట్లు నా తండ్రి రాజేశ్ పైలట్ బాంబులు వేశారు.. ఎయిర్ ఫోర్స్ పైలట్ గా 1971 ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. తూర్పు పాకిస్థాన్ భూభాగంపై ఆయన బాంబులు వేశారు’ అని చెప్పారు. 1966 అక్టోబర్ 29న తన తండ్రి రాజేశ్ పైలట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారని వివరించారు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ ను సచిన్ పైలట్ ట్వీట్ కు జోడించారు.

అంతకుముందు అమిత్ మాలవీయ ట్వీట్ చేస్తూ.. తేదీలు సరిగా గుర్తులేవు కానీ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా పనిచేసిన మాజీ ఎంపీ రాజేశ్ పైలట్, సురేశ్ కల్మాడీలు 1966 మార్చి 5న మన దేశంలోని మిజోరంపై బాంబులు వేశారని ఆరోపించారు. తర్వాతి కాలంలో రాజేశ్ పైలట్, సురేశ్ కల్మాడీలు ఇద్దరూ ఎంపీలుగా పార్లమెంట్ లో అడుగుపెట్టారని చెప్పారు. మిజోరంపై బాంబులు వేసినందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ పార్టీ వారిని పార్లమెంట్ కు పంపించిందని విమర్శించారు.

More Telugu News