Nara Lokesh: సొంత నియోజకవర్గంలో నారా లోకేశ్ యువగళం... హైలైట్స్ ఇవిగో!

Nara Lokesh Yuvagalam Padayatra in Mangalagiri constituency
  • మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • ఫ్రీడమ్ వాక్ లో పాల్గొన్న లోకేశ్
  • టీడీపీలో చేరిన వైసీపీ నేతలు... పసుపు కండువాలు కప్పిన యువనేత
  • దాదాపు 500 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక
  • ప్రతి ఒక్కరినీ అభినందించిన లోకేశ్
  • టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ చాలెంజ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు సొంత అసెంబ్లీ నియోజకవర్గం మంగళగిరిలో అపూర్వ ఆదరణ లభించింది. 185వ రోజు యువగళం పాదయాత్ర నిడమర్రు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభం కాగా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయజెండాను చేతబట్టి యువగళం రథసారధి లోకేశ్ ఫ్రీడమ్ వాక్ లో పాల్గొన్నారు. ఆయనకు సంఘీభావంగా వేలాదిగా ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు మువ్వన్నెల జెండాలతో పాదయాత్రలో పాల్గొన్నారు. 

లోకేశ్ రాక నేపథ్యంలో, మంగళగిరి రైల్వే గేట్ వద్ద ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. నిడమర్రు శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర... బేతపూడి బాపూజీనగర్, మంగళగిరి రైల్వేగేట్, మార్కెట్ యార్డు, పాతబస్టాండు, మున్సిపల్ ఆఫీసు, ఆర్టీసీ బస్టాండు, నవులూరు రోడ్డు మీదుగా యర్రబాలెం డాన్ బాస్కో స్కూలు వద్ద విడిది కేంద్రానికి చేరుకుంది. 

తొలిరోజే మంగళగిరిలో యువగళం ప్రకంపనలు

మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర అధికార వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. లోకేశ్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన తొలిరోజే పెద్దఎత్తున వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. మంగళగిరి నియోజకవర్గం నిడమర్రు క్యాంప్ సైట్ లో వైసీపీ నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు లోకేశ్ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 500కు పైగా కుటుంబాలు టీడీపీలో చేరాయి. 

ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ... ఎమ్మెల్యే ఆర్కే తమను స్వార్థ ప్రయోజనాలకోసం వాడుకొని, ఎటువంటి గుర్తింపు ఇవ్వకుండా గాలికొదిలేశాడని తెలిపారు. అక్కడ తమకు ఎటువంటి గుర్తింపు లేకపోవడంతో నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయామని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తామంతా యువనేత లోకేశ్ సారథ్యంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వారు పేర్కొన్నారు.

లోకేశ్ మాట్లాడుతూ...

వైసీపీ స్వార్ధపూరిత రాజకీయాలకు వందలాది కుటుంబాలు బలయ్యాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరేయడానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని కోరారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ నిలబడుతుందని అన్నారు. నాయకులు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యతనిచ్చి అన్నివిధాలా అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా అభినందించారు.

నిడమర్రు గ్రామానికి చెందిన వైసీపీ కీలక నేత గాదె లక్ష్మారెడ్డి, వారి అనుచరులు, చినకాకానికి చెందిన మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ సుంకర రఘుపతిరావు, పెదవడ్లపూడి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు నాగళ్ల శీధర్, కురగల్లు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు తోట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెద్దఎత్తున వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. 

పదవీకాలం ముగుస్తున్నా స్టిక్కర్ల బతుకేనా... అభివృద్ధి అంటే రంగులు వేసుకోవడమేనా?

నిడమర్రులో టిడ్కో గృహాల వద్ద సెల్ఫీ దిగిన లోకేశ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. "ఇవి రాజధాని పరిధిలోని నిడమర్రులో పేదలకోసం గత టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహాలు. పేదలకు కొత్తగా ఇళ్లు కట్టడం చేతగాని జగన్ మేం నిర్మించిన ఇళ్లకు మాత్రం వైసీపీ రంగులేసుకున్నారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో చేసిందేమైనా ఉంది అంటే అది స్టిక్కర్లు వేసుకోవడమే. 

కూల్చివేతలు మినహా పదవీకాలం ముగిసే లోపు ప్రజల కోసం నేను ఫలానా మంచి పని చేశానని ఒక్కటైనా చూపించగలరా? ఇంకా ఎంతకాలం ఈ స్టిక్కర్ల బతుకు జగన్మోహన్ రెడ్డీ? మేము కట్టిన టిడ్కో ఇళ్ల దగ్గర కనీసం మౌలిక వసతులు కల్పించడం జగన్ ప్రభుత్వానికి చేతకాలేదు" అంటూ లోకేశ్ దుయ్యబట్టారు.

విజనరీ పాలనకు 'అమృత' సాక్ష్యం!

అమరావతిలోని అమృత యూనివర్సిటీ వద్ద సెల్ఫీ దిగిన లోకేశ్... జగన్ ప్రభుత్వంపై వాగ్బాణాలు సంధించారు. 

"ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉన్నత విద్యకోసం పొరుగురాష్ట్రాల బాట పట్టకూడదన్న ఉద్దేశంతో జాతీయస్థాయిలో పేరెన్నికగన్న అమృత విశ్వవిద్యాలయాన్ని గత ప్రభుత్వంలో అమరావతికి తీసుకొచ్చాం. దీంతోపాటు విట్, ఎస్ఆర్ఎం లాంటి ప్రఖ్యాత విద్యాసంస్థలను కూడా ఆనాడు రాష్ట్రానికి రప్పించాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ విద్యాలయాలకు వెళ్లేందుకు కనీసం రహదారి సౌకర్యం లేకుండా రోడ్డును తవ్వేసి విద్యార్థులను ఇబ్బందుల పాల్జేస్తున్నాడు. 

విధ్వంసమే ఎజెండాగా సాగుతున్న జగన్ ఏలుబడిలో రాష్ట్రంనుంచి వెళ్లిపోవడమే తప్ప కొత్తగా ఒక్క పరిశ్రమగానీ, విద్యాసంస్థగానీ వచ్చింది లేదు. విజనరీ పాలనకు, విధ్వంసకుడి అరాచకానికి సాక్షీభూతంగా నిలుస్తోంది ప్రజా రాజధాని అమరావతి" అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

లోకేశ్ ను కలిసిన గుంటూరు జిల్లా సర్పంచులు

నిడమర్రు క్యాంప్ సైట్ లో ఉమ్మడి గుంటూరు జిల్లా సర్పంచ్ లు యువనేత లోకేశ్ ను కలిసి వినతిత్రం సమర్పించారు. ప్రభుత్వం కొల్లగొట్టిన 14, 15వ ఆర్ధిక సంఘం నిధులు తిరిగి ఇప్పించేలా చొరవ తీసుకోవాలని కోరారు. పంచాయతీ రాజ్ శాఖా మంత్రిగా లోకేశ్ తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు. 

టీడీపీ అధికారంలోకి వచ్చాక పంచాయతీల అభివృద్ధిపై మేనిఫెస్టో పొందుపర్చాలని కోరారు. సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల కుటుంబ సభ్యులకు ఏడాదిలో ఒక రోజు తిరుమల బ్రేక్ దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

లోకేశ్ స్పందిస్తూ... 

పంచాయతీల అభివృద్ధికి అదనపు నిధులు ఇవ్వకపోగా, పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ లు ఇచ్చిన రూ.9 వేల కోట్లను జగన్ ప్రభుత్వం దొంగిలించడం దారుణమని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు నిధులు కేటాయించి, గత వైభవం తెస్తామని చెప్పారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న సర్పంచ్ లకు లోకేశ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2486.3 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 10.3 కి.మీ.*

*186వరోజు (16-8-2023) యువగళం వివరాలు*

*మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి గుంటూరుజిల్లా)*

సాయంత్రం

4.00 – యర్రబాలెం శివారు డాన్ బాస్కో స్కూలు వద్ద యువతతో “హలో లోకేశ్ ” కార్యక్రమం.

7.00 – యర్రబాలెం శివారు డాన్ బాస్కో స్కూలు వద్ద విడిది కేంద్రంలో బస.

******
Nara Lokesh
Mangalagiri
Yuva Galam Padayatra
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News