Mohan Babu: వాటిని చూసినప్పుడల్లా నా తల్లిదండ్రులు, నా గ్రామం, నా గ్రామస్తులు గుర్తుకురావాలి: మోహన్ బాబు

  • స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన యూనివర్శిటీలో చెట్లు నాటిన మోహన్ బాబు
  • తన గ్రామస్తులు చేత మట్టి, ఇసుక తెప్పించిన మోహన్ బాబు
  • తాను ఈ స్థాయికి రావడానికి తనకు జన్మనిచ్చిన పల్లెటూరే కారణమని వ్యాఖ్య
Mohan Babu done plantation in his university

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సినీ నటుడు మోహన్ బాబు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావులు దేశం కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసి మనకు స్వాతంత్య్రం అందించారని చెప్పారు. ఈరోజు మనం ఇలా జీవిస్తున్నామంటే వారి త్యాగాలే కారణమని అన్నారు. తనకు జన్మనిచ్చిన గ్రామం మోదుగులపాళెం అని... ఒక నటుడిగా, ఒక నిర్మాతగా, రాజ్యసభ సభ్యునిగా, విద్యాప్రదాతగా ఎదగడానికి తన తల్లిదండ్రులు, తన గ్రామ ప్రజలు మూలకారణమని చెప్పారు. పల్లెటూరు నుండి ఢిల్లీ పార్లమెంటు వరకు తన ప్రస్థానం కొనసాగడానికి తనకు జన్మనిచ్చిన తన పల్లెటూరే కారణమని అన్నారు.

తన జన్మభూమి ఎప్పుడూ మనసులో మెదులుతూ ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికను రూపొందించుకున్నానని మోహన్ బాబు తెలిపారు. తాను స్థాపించిన యూనివర్శిటీలో మొక్కలను నాటాలనుకున్నానని చెప్పారు. తన స్వగ్రామం వద్ద ప్రవహించే స్వర్ణముఖి నది ఇసుకను ఒక గుప్పెడు, వారి పొలంలోని మట్టిని ఒక గెప్పుడు తీసుకురావాలని 100 మంది తమ గ్రామస్తులకు చెప్పానని... వారు తెచ్చిన ఇసుక, మట్టితో 100 మొక్కలు నాటించానని తెలిపారు. అవి పెరిగి పెద్దయిన తర్వాత వాటిని చూసిన ప్రతిసారి తనకు తన తల్లిదండ్రులు, తన జన్మభూమి, తన గ్రామస్తులు గుర్తుకు రావాలనేదే తన ఆశ అని చెప్పారు. మరోవైపు, ఈ కార్యక్రమంలో మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు కూడా పాల్గొన్నారు.

More Telugu News