Doctor Radha: పకడ్బందీగా ప్లాన్ చేసి మట్టుబెట్టామే.. మీరెలా పసిగట్టారు.. డాక్టర్ రాధ భర్త ప్రశ్నకు పోలీసుల షాక్!

  • మచిలీపట్టణంలో సంచలనం సృష్టించిన డాక్టర్ రాధ హత్య కేసు
  • డ్రైవర్ మధుతో కలిసి పక్కాగా ప్లాన్ చేసి చంపేసిన భర్త డాక్టర్ మహేశ్వరరావు
  • మూడు నెలల ముందే హత్యకు ప్రణాళిక
  • హత్య సమయంలో ఇంట్లో 8 కేజీల బంగారం, రూ. 50 లక్షల నగదు
  • వాటిని ముట్టుకోకపోవడంపై అనుమానం
  • జోరు వర్షంలో సూపర్ మార్కెట్‌కు వెళ్లి కారం ప్యాకెట్ కొనుగోలు చేసిన డ్రైవర్
How police chased Machilipatnam doctor Radha murder case

కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో సంచలనం సృష్టించిన డాక్టర్ రాధ హత్య కేసు నిందితుడైన ఆమె భర్త డాక్టర్ లోక్‌నాథ మహేశ్వరరావు పోలీసులనే ఆశ్చర్యపరిచాడు. తాను చాలా పకడ్బందీగా, ఎలాంటి అనుమానాలు రాకుండా హత్య చేశానని, మీరెలా కనుక్కోగలిగారంటూ ఆయన వేసిన ప్రశ్నతో పోలీసులే నిర్ఘాంతపోయారు. ఆరు పదులు దాటిన వయసులో ఆస్తి కోసం కట్టుకున్న భర్తే గత నెల 25న తన డ్రైవర్‌తో కలిసి మట్టుబెట్టాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు కిందికొచ్చి తన ఆసుపత్రిలో తాపీగా రోగులను చూస్తూ కూర్చున్నాడు. ఈ కేసులో మహేశ్వరరావు, డ్రైవర్ మధును శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది.

ఎలా దొరికిపోయాడంటే..
నిందితుడు మహేశ్వరరావు ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. అందుకోసం డాక్టర్ తెలివిని ఉపయోగించాడు. అయినా, పోలీసులు పసిగట్టేయడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అందుకే, తానంత పక్కాగా ప్లాన్ చేసినా ఎలా పట్టేశారని ప్రశ్నించి పోలీసులే నిర్ఘాంతపోయేలా చేశాడు. హత్య జరిగిన రోజున పోలీసులకు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదు. ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేయలేదు. అయితే, భారీ వర్షం కురుస్తుండడంతో దొంగతనానికి వచ్చే అవకాశం లేదు. అది కూడా సాయంత్రం వేళ. ఒకవేళ దొంగతనానికి వచ్చినా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను వదిలిపెట్టరు. 

ఆ సమయంలో ఇంట్లో 8 కిలోల బంగారం, రూ. 50 లక్షల నగదు ఉంది. దొంగతనం చేసిన వారు వాటిని ముట్టుకోకుండా కేవలం ఆమె ఒంటిపైన ఉన్న నగలను మాత్రమే తీసుకెళ్లడం పోలీసులను అనుమానించేలా చేసింది. దీనికి తోడు సాంకేతిక ఆధారాలు కూడా నిందితులను పట్టించాయి. టవర్ డంప్ విశ్లేషణలో 12 ఫోన్ నంబర్లు అనుమానాస్పదంగా కనిపించాయి. ఇందులో ఒక నంబరు డాక్టర్ మహేశ్వరరావుదిగా తేలింది. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు డ్రైవర్‌ మధుకు ఆ నంబరు నుంచి పదేపదే ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఇవన్నీ పోలీసుల అనుమానాన్ని మరింత పెంచాయి.

మూడు నెలల ముదే పథకం
డాక్టర్ రాధ హత్యకు మూడు నెలల ముందే డాక్టర్ మహేశ్వరరావు పక్కాగా ప్లాన్ చేశాడు. ఆసుపత్రి సీసీ టీవీ కెమెరాల్లో సమస్య ఉండడంతో టెక్నీషియన్‌ను పిలిపించి చూపించారు. అయితే, రూ. 30 వేలు అవుతుందని చెప్పడంతో చేయించలేదు. దీనిని కూడా ఆయన ఓ అవకాశంగా మలచుకున్నారు. జులై 26న రాధ తన కోడలు ప్రసవం కోసం పిడుగురాళ్ల వెళ్లాల్సి ఉంది. అయితే, ఆమె వెళ్తే ఇప్పట్లో రాదని భావించిన నిందితుడు 25నే హత్యకు ప్లాన్ చేశాడు. హత్య జరిగిన రోజున నిందితులు మహేశ్వరరావు, డ్రైవర్ మధు సాయంత్రం 5.45 గంటలకు ఇంటి లోపలికి వెళ్తున్న దృశ్యాలు ఆసుపత్రి పక్కనున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. హత్య అనంతరం లిఫ్ట్ ద్వారా డాక్టర్, మెట్ల మార్గంలో మధు కిందికి రావడం కూడా రికార్డయింది. అనంతరం జోరు వానలో డాక్టర్ స్కూటీపై సూపర్ మార్కెట్‌కు వెళ్లి కారం ప్యాకెట్ కొనుగోలు చేయడం కూడా సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ నేపథ్యంలో మధును అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

తొలుత నిరాకరించినా..
డ్రైవర్ మధు తొలుత తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, ఆధారాలను చూపించడంతో తప్పించుకోలేకపోయాడు. సాయంత్రం 5.55-6.02 మధ్య హత్య జరిగినట్టు అంగీకరించాడు. దీంతో మహేశ్వరరావును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తొలుత నోరు విప్పకున్నా.. ఆ తర్వాత మాత్రం పోలీసులనే ప్రశ్నించి ఆశ్చర్యపరిచాడు. తాను పక్కా ప్లాన్‌తోనే హత్య చేశానని, ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డామని, అయినా ఎలా పట్టుకోగలిగారని ప్రశ్నించి పోలీసులనే షాక్‌కు గురిచేశాడు.

More Telugu News