BJP: '50 శాతం కమిషన్' ఆరోపణలపై ప్రియాంకగాంధీకి మధ్యప్రదేశ్ బీజేపీ హెచ్చరిక

  • మధ్యప్రదేశ్ ప్రభుత్వం 50 శాతం కమిషన్ తీసుకుంటుందని ప్రియాంక గాంధీ పోస్ట్
  • తీవ్రంగా స్పందించిన రాష్ట్ర బీజేపీ, ప్రభుత్వం
  • కాంగ్రెస్ దారుణ రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ ఆగ్రహం
  • ఆధారాలు చూపించండి.. లేదంటే చట్టపరమైన చర్యలేనని హెచ్చరిక : 
Madhya Pradesh BJP Warns Priyanka Gandhi Of Legal Action Over 50 Commission Charge

మధ్యప్రదేశ్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, 50 శాతం కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ప్రియాంకపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మధ్యప్రదేశ్ బీజేపీ హెచ్చరించింది. ఆమె ఆరోపణలు తప్పని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఖండించారు. ఆరోపణలకు సంబంధించి ఆమె వద్ద ఆధారాలు ఉంటే చూపించాలని, లేదంటే తాము తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు.

తమ వద్ద నుండి 50 శాతం కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపిస్తూ కాంట్రాక్టర్ల సంఘం నేతలు హైకోర్టు న్యాయమూర్తికి రాసినట్లుగా ఉన్న లేఖను ప్రియాంక గాంధీ శుక్రవారం పోస్ట్ చేశారు. కర్ణాటకలో 40 శాతం కమిషన్ తీసుకుంటే, మధ్యప్రదేశ్‌లో ఏకంగా 50 శాతం తీసుకొని తమ రికార్డులను తామే తిరగరాస్తున్నారని, ఇప్పటికే కర్ణాటకలో బీజేపీని ఇంటికి పంపించారని, మధ్యప్రదేశ్ 50 శాతం సర్కార్ మిగిలి ఉందని ప్రియాంక పేర్కొన్నారు. దీనిపై బీజేపీ దీటుగా స్పందించింది.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ దారుణ రాజకీయాలు చేస్తోందని మిశ్రా విమర్శించారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మొదట రాహుల్ గాంధీతో అబద్ధాలు చెప్పించారని, ఇప్పుడు ప్రియాంక గాంధీతో తప్పుడు ట్వీట్ చేయించారన్నారు. ప్రియాంక గారూ... మీ పోస్టుకు రుజువు చూపించండి.. లేదా మా చర్యలకు సిద్ధంగా ఉండండి అని మంత్రి హెచ్చరించారు.

ఆమె పోస్ట్ చేసింది నకిలీ పోస్ట్ అని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీజేపీ చీఫ్ వీడి శర్మ హెచ్చరించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికార దాహంతో ఉందని, అబద్ధాలు చెబుతూ అధికారంలోకి రావాలని భావిస్తోందన్నారు. ప్రియాంక చేసిన ఈ ఆరోపణలు సైబర్ క్రైమ్ కిందకు వస్తాయన్నారు. ప్రియాంక తన పోస్ట్ ద్వారా మధ్యప్రదేశ్‌నే కాదు.. దేశాన్ని కూడా తప్పుదోవ పట్టించారన్నారు. ఆమె పోస్ట్‌పై కాంగ్రెస్ అధిష్ఠానం సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. అయితే తాము అవినీతిని నిరూపిస్తామని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మీడియా విభాగం చైర్మన్ కేకే మిశ్రా అన్నారు.

More Telugu News