Leapard attack: తిరుమలలో మరోసారి చిరుత దాడి.. ఆరేళ్ల బాలిక మృతి

  • శుక్రవారం అలిపిరి కాలినడక మార్గంలో ఘటన
  • రాత్రి 8 గంటలకు బాలికతో బయలుదేరిన కుటుంబం
  • 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నాక చిరుత దాడి
  • బాలికను అడవిలోకి లాక్కుపోయిన చిరుత
  • బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు 
  • మరుసటి రోజు ఉదయం ఆలయానికి సమీపంలో బాలిక మృతదేహం గుర్తింపు
six year old kid dies in leopard attack in Tirumala alipiri

తిరుమలలో మరోసారి చిరుత దాడితో కలకలం రేగింది. అలిపిరి కాలినడక మార్గంలో వెళుతున్న ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసి చంపేసింది. శుక్రవారం ఈ దారుణం వెలుగు చూసింది. రాత్రి 8 గంటల సమయంలో చిన్నారి లక్షితతో కలిసి కుటుంబసభ్యులు శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ముందు వెళుతున్న బాలికపై అకస్మాత్తుగా ఓ చిరుత దాడి చేసింది. దీంతో, కుటుంబసభ్యులు కేకలు వేయడంతో బాలికను అడవిలోకి లాక్కెళ్లిపోయింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

రాత్రి సమయంలో గాలింపు చర్యలు కుదరకపోవడంతో పోలీసులు ఉదయం వెతుకుతుండగా బాలిక మృతదేహం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కొద్ది దూరంలో కనిపించింది. బాలిక మృతదేహాన్ని చిరుత సగం తిన్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితుల స్వస్థలం నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెమని తెలిపారు. జూన్ 11న ఓ బాలుడిపై ఇలాగే చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో బాలుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు.

More Telugu News