Posani Krishna Murali: సినిమా టికెట్ రేట్ల పెంపు అంశంపై పోసాని స్పందన 

  • ఏపీలో టికెట్ రేట్ల పెంపునకు దరఖాస్తు చేసుకున్న భోళాశంకర్ నిర్మాత
  • టికెట్ రేట్ల అంశంపై గతంలోనే తాను సీఎం జగన్ కు వివరించానన్న పోసాని
  • అగ్రహీరోలు పారితోషికం తగ్గించుకుంటే సమస్య ఉండదని చెప్పానని వెల్లడి
  • చిరంజీవి, ప్రభాస్, మహేశ్ ల సమక్షంలోనే సీఎంతో చెప్పినట్టు స్పష్టీకరణ
Posani reacts on cinema tickets rates issue in AP

తమ చిత్రానికి టికెట్ రేట్లు పెంచాలంటూ భోళా శంకర్ నిర్మాత ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడంతో, టికెట్ రేట్ల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గతంలో ఓసారి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ పెద్దలు ఏపీ సీఎం జగన్ ను కలిసి ఇండస్ట్రీ సమస్యలు విన్నవించారు. వాటిలో టికెట్ రేట్ల అంశం కూడా ఉంది. 

నాటి సమావేశంలో పోసాని కృష్ణమురళి కూడా పాల్గొన్నారు. ఆ సమావేశంలో తాను ఏం మాట్లాడారో పోసాని తాజాగా వెల్లడించారు. 

"ఆ సమావేశంలో అప్పటి మంత్రి పేర్ని నాని, చిరంజీవి, రాజమౌళి, మహేశ్ బాబు, ప్రభాస్, అలీ తదితరులు ఉన్నారు. గతంలో యుద్ధం సమయంలో సినిమా టికెట్ రేట్లు పెంచాలని అప్పటి పెద్దలు అడిగినట్టు నాకు గుర్తుంది. మళ్లీ టికెట్ రేట్లు పెంచండి అని అడగడం ఇప్పుడే వింటున్నా. 

ఆ రోజు సీఎం జగన్ ముందు కూడా ఇదే మాట అడిగాను. అప్పుడంటే యుద్ధం కారణంగా ఆర్థిక సంక్షోభం వచ్చింది... టికెట్ రేట్లు పెంచమన్నారు. ఇప్పుడు ఏ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని టికెట్ రేట్లు పెంచమంటున్నారు? వీళ్లు (టాలీవుడ్ అగ్రహీరోలు) ఒక్కొక్కరు రూ.40 కోట్లు, రూ.60 కోట్ల పారితోషికం తీసుకుంటారు. 

చిత్రపరిశ్రమ క్షేమం కోరేవారైతే టికెట్ రేట్లు పెంచమనడం ఎందుకు... వారే తమ పారితోషికంలోంచి రూ.10 కోట్లో, రూ.20 కోట్లో తగ్గించుకోవచ్చుగా! 

వీళ్లందరూ ఆర్థికంగా బాగా స్థిరపడినవాళ్లే సర్... టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి? అని సీఎం జగన్ నే అడిగాను. అసలు సమస్య ఏంటన్నది ఆయనకు తెలియజెప్పాలనే నేను ఆ రోజు మాట్లాడాల్సి వచ్చింది. నేను ఇంకా మాట్లాడుతుంటే పేర్ని నాని ఆపాడు" అని వివరించారు. 

భోళాశంకర్ టికెట్ రేట్ల వ్యవహారం నేపథ్యంలో పోసాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

More Telugu News