Election Commission: మరో వివాదాస్పద బిల్లుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!

  • సీఈసీ, ఈసీల బిల్లు–2023ను రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు లిస్ట్ చేసిన కేంద్రం 
  • నియామక కమిటీ నుంచి సీజేఐని తొలగిస్తూ బిల్లులో మార్పులు
  • తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు
govt lists bill in rs to regulate appointment of cec and ecs

ఢిల్లీ సర్వీసుల బిల్లు విషయంలో రేగిన వివాదం ఇంకా ముగియకముందే.. మరో వివాదాస్పద బిల్లుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల నియామకాలను నియంత్రించేలా కొత్త చట్టం తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. నియామక ప్యానెల్‌ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని తొలగిస్తూ కొత్త బిల్లులో మార్పులు చేయడం గమనార్హం.

కొలీజియం వ్యవహారంలో కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య అభిప్రాయ భేదాలు కొనసాగుతున్న వేళ ఈ బిల్లు తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. 
ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల (ఈసీ నియామకాలు, సర్వీసులు కండిషన్లు, పదవీకాలం) బిల్లు–2023ను రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు ఈ మేరకు జాబితా చేసింది. 

త్రిసభ్య కమిటీ సిఫార్సుల మేరకు ఎన్నికల సంఘంలో నియామకాలను రాష్ట్రపతి చేపట్టాలని బిల్లులో పేర్కొంది. ఈ మేరకు నియామక కమిటీ నుంచి సీజేఐని తొలగించింది. త్రిసభ్య కమిటీలో ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్ చేసిన ఓ కేంద్ర మంత్రి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి ప్రధాని నేతృత్వం వహిస్తారు.

ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘాన్ని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నియంత్రించాలని అనుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈసీని తమ చేతిలో తోలుబొమ్మగా మారుస్తోందని మండిపడింది. ఇది అత్యంత ప్రమాదకర నిర్ణయమని, ఎన్నికల పారదర్శకతపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు.

More Telugu News