Corona Virus: కొత్త కరోనా వేరియంట్‌తో అమెరికాలో కలకలం

  • అగ్రరాజ్యంలో కొత్త కరోనా కేసుల్లో 17 శాతానికి కారణమవుతున్న ఈజీ.5 వేరియంట్
  • ప్రస్తుతమున్న ఎక్స్‌బీబీ 1.9.2 రికాంబినెంట్ వైరస్ నుంచి పుట్టుకొచ్చిన ఈజీ.5
  • ఈజీ.5 నుంచి మరో ఈజీ 5.1  స్ట్రెయిన్ జననం
  • కొత్త వేరియంట్స్‌తో వ్యాధి తీవ్రతలో ఎటువంటి మార్పు లేదన్న శాస్త్రవేత్తలు
New Covid Variant EG5 Causing 17 percent of Cases In US

అమెరికాలో ఓ కొత్త కరోనా వేరియంట్ కారణంగా మళ్లీ కలకలం మొదలైంది. ఇటీవల పుట్టుకొచ్చిన ఈజీ.5 వేరియంట్ ప్రస్తుతం వెలుగు చూస్తున్న మొత్తం కేసుల్లో 17 శాతం కారణమని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ(యూఎస్‌సీడీసీ) తాజాగా పేర్కొంది. ఒమైక్రాన్ వైరస్‌ల జాతికి చెందిన ఎక్స్‌బీబీ 1.9.2 రికాంబినెంట్ వైరస్‌ నుంచి ఇది పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఎక్స్‌బీబీ 1.9.2‌ స్ట్రెయిన్‌తో పోలిస్తే ఈజీ.5లోని స్పైక్ ప్రోటీన్‌లో ఒక జన్యుమార్పు(మ్యూటేషన్) అదనంగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీరంలోని కణాలకు వైరస్ సోకేందుకు స్పైక్ ప్రోటీన్ కీలకమన్న విషయం తెలిసిందే. కాగా, ఈ కొత్త మ్యూటేషన్ గతంలో ఇతర కరోనా వేరియంట్లలో కూడా గుర్తించామని చెప్పారు. అయితే, దీని వల్ల వైరస్‌కు కలిగే అదనపు ప్రయోజనాలపై స్పష్టత లేదని పేర్కొన్నారు. 465 మ్యూటేషన్‌గా పేరుపడ్డ ఈ జన్యుమార్పు ప్రపంచవ్యాప్తంగా 35 శాతం వైరస్‌లలో ఉన్నట్టు గుర్తించారు. మరోవైపు, ఈజీ.5 నుంచి ఇప్పటికే ఈజీ.5.1 పేరుగల మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇది కూడా వేగంగా వ్యాపిస్తోంది. 

కొలంబియా యూనివర్సిటీకి చెందిన మైక్రోబయాలజీ, ఇమ్యూనాలజీ ప్రొఫెసర్ డా. డేవిడ్ హో, ఈ వైరస్‌పై పరిశోధన చేస్తున్నారు. కరోనా టీకాలతో శరీరంలో ప్రేరేపితమైన యాంటీబాడీలను నుంచి ఈ వైరస్ ఏమేరకు తప్పించుకుంటోందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా నిరోధక యాంటీబాడీల నుంచి ఈ రెండు కొత్త వేరియంట్లు కొంత మేర తప్పించుకోగలుగుతున్నాయని గుర్తించారు. ఫలితంగా, ఇవి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. అయితే, వీటి వల్ల కలిగే వ్యాధి తీవ్రతలో ఎటువంటి మార్పూ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇతర కరోనా వేరియంట్లతో పోలిస్తే ఇది రోగ నిరోధకవ్యవస్థ నుంచి మరింత సమర్థవంతంగా తప్పించుకుంటోందని వివరించారు.

More Telugu News