Viral Videos: ఒక్క బైక్ పై ఏడుగురు ప్రయాణం.. వీడియో షేర్ చేసిన సజ్జనార్.. వీడియో ఇదిగో!

  • ప్రాణాలను పణంగా పెట్టడమేనని ఆర్టీసీ ఎండీ హెచ్చరిక
  • బైక్ పై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని హితవు
  • ఆర్టీసీ బస్సుల్లో ఎంతమంది ప్రయాణించాలంటూ ప్రశ్నించిన నెటిజన్
Viral Video by shared by Sajjanar

బైక్ పై సాధారణంగా ఇద్దరు ప్రయాణిస్తుంటారు.. అత్యవసర సందర్భాల్లో, మరో దారిలేని పరిస్థితుల్లో ముగ్గురు ప్రయాణించడమూ మామూలే. అయితే, ఒకే బైక్ పై ఏడుగురు ప్రయాణించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ లో చోటుచేసుకుందీ ఘటన. ఇది చూసిన ఓ కారు డ్రైవర్ షాక్ కు గురై తన మొబైల్ లో రికార్డు చేశాడు. ఆ వీడియోను నెట్ లో పెట్టడంతో వైరల్ గా మారింది. తాజాగా టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఒకే బైక్ పై ఏడుగురు ప్రయాణించడమా.. బైక్ పై ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి. అంతకంటే ఎక్కువమంది ప్రయాణించడం నేరం.. అంటూ ట్వీట్ చేశారు.

ద్విచక్ర వాహనంపై ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని, అంతకంటే ఎక్కువమంది ప్రయాణించడం ప్రాణాలకే ప్రమాదమని సజ్జనార్ హెచ్చరించారు. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని చెప్పారు. ఈ వీడియోలో చూపినట్లు ప్రయాణించడమంటే ప్రాణాలను ఫణంగా పెట్టడమేనని సజ్జనార్ పేర్కొన్నారు. అయితే, ఆర్టీసీ ఎండీ ట్వీట్ కు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. బైక్ పై ఇద్దరికంటే ఎక్కువ మంది ప్రయాణించడం నేరం.. నిజమే సర్, కానీ ఆర్టీసీ బస్సులో ఎంతమంది ప్రయాణించాలనే విషయంలో ఎలాంటి రూల్స్ లేవా అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఈ వీడియోలో కనిపిస్తున్న బైక్ స్థానంలో ఆర్టీసీ బస్సును ఊహించుకుని చూడండి అంటూ కామెంట్ చేశారు.

More Telugu News