Chiranjeevi: ‘పిచ్చుకపై బ్రహ్మా స్త్రానికి’ ముందు చాలా ఉంది.. బయటకొచ్చిన చిరంజీవి మొత్తం వీడియో

  • వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల ఫంక్షన్‌లో చిరంజీవి వ్యాఖ్యలు వివాదాస్పదం
  • తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఏపీ మంత్రులు
  • రెమ్యునరేషన్ గురించి పార్లమెంటులోనూ చర్చిస్తున్నారని చిరు ఆవేదన
  • సినిమాలు చేయడం వల్ల ఎన్నో కుటుంబాలు ఆనందంగా ఉంటాయన్న మెగాస్టార్
  • బిజినెస్ అవుతుంది కాబట్టే డబ్బులు ఇస్తున్నారని వ్యాఖ్య
Megastar Chiranjeevi Comments Full Video Released

వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’ వ్యాఖ్యలు రేపిన దుమారం అంతా ఇంతాకాదు. చిరు వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మొత్తం విరుచుకుపడ్డారు. ఆ ఫంక్షన్‌లో చిరంజీవి మాట్లాడిన పూర్తి వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఈ వీడియోను పరిశీలిస్తే ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’ వ్యాఖ్యలకు ముందు చిరంజీవి చాలానే మాట్లాడారు. 

ఆయన వ్యాఖ్యలు యథాతథంగా.. ‘‘ఎన్ని సినిమాలు చేస్తే అంతమందికి ఉపాధి లభిస్తుంది. వాళ్ల ఫ్యామిలీస్ ఆనందంగా ఉంటాయి. సినిమా వాళ్లకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని పార్లమెంటులో కూడా మాట్లాడుతున్నారు అంటే వాళ్లకేం పనీపాటా లేదా? అనిపిస్తుంది. సర్, సినిమాలు చేస్తున్నామంటే బిజినెస్ అవుతుంది కాబట్టే. అందుకే డబ్బులు ఇస్తున్నారు. సినిమా మీద సినిమా తీస్తున్నామంటే మాకు డబ్బులు వస్తాయని కాదు సర్. మా వాళ్లకు ఉపాధి లభిస్తుందని. దేశంలో ఇంతకుమించి సమస్యన్నదే లేనట్టు పార్లమెంటులో కూడా దీని గురించి మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టకరం. సినిమాను దూరంగా ఉంచండి. మా కష్టాలేవో మేం పడతాం. 

ఆదరిస్తే సంతోషం. మేం ఖర్చు చేస్తున్నాం కాబట్టే తెలుగు సినీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో ఉంది. ఇంత ఖర్చు చేస్తున్నందుకు ఎంతో కొంత రావాలని కోరుకుంటాం. వీలైతే సహకరించండి. అంతేకానీ, ఇదేదో పెద్ద తప్పన్నట్టు దేశవ్యాప్తంగా ఎత్తి చూపించడానికో రాజ్యసభ వరకు తీసుకెళ్లొద్దని విన్నవించుకుంటున్నాను. రాజకీయ నాయకులతో పోలిస్తే సినిమా ఎంతండీ. చాలా చిన్నది. నేను అదీ చూశాను.. ఇదీ చూశాను. మీలాంటి వాళ్లు పెద్దపెద్ద విషయాల్లో జోక్యం చేసుకోవాలి. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వడం వంటి వాటి గురించి తలవంచి నమస్కరిస్తాం. అంతేకానీ, పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమా పరిశ్రమపై ఏంటి సర్’’ అని చిరంజీవి ఆ ఫంక్షన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అనే మాటను మాత్రమే వైరల్ చేయడంతో అదికాస్తా వివాదాస్పదమైంది. కాగా, తారల పారితోషికాలపై ఇటీవల వైసీపీ ఎంపీ విజయాసాయిరెడ్డి రాజ్యసభలో ప్రస్తావించడాన్ని దృష్టిలో పెట్టుకునే చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు.

More Telugu News