Revanth Reddy: అలా చేసి ఉంటే ప్రధాని మోదీ గౌరవం పెరిగి ఉండేది: రేవంత్ రెడ్డి

Revanth Reddy lashes out at PM Modi
  • ఆదివాసీల పట్ల, గిరిజనుల పట్ల ప్రధానికి ఉన్న చులకన భావం అర్థమైందన్న రేవంత్
  • ప్రధాని మోదీ, మంత్రి మండలిపై ప్రజలకు విశ్వాసం పోయిందని వ్యాఖ్య
  • మణిపూర్ మండిపోతుంటే ఓట్ల వేట కోసం కర్ణాటకలో ఉన్నారని ఆరోపణ
  • ప్రధాని ఆ జాతికి ఈ సభ వేదికగా క్షమాపణ చెప్పి ఉంటే గౌరవం పెరిగేదని వ్యాఖ్య 
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీ, ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. సభలో ఆయన మాట్లాడుతూ... ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సోదరులందరికీ లోక్ సభ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఈ సభకు హాజరై మణిపూర్‌లో జరిగిన దాడులను, మారణకాండను, మహిళలపై జరిగిన అత్యాచారాలను ఖండించి, ఆ జాతికి ఈ సభ వేదికగా క్షమాపణ చెప్పి ఉంటే ఆయన గౌరవం పెరిగి ఉండేదన్నారు. కానీ ఆదివాసీల పట్ల, గిరిజనుల పట్ల ప్రధానికి ఉన్న చులకన భావం దీంతో అర్థమైందన్నారు.

మణిపూర్‌లో జరిగిన ఘటనలు మాత్రమే కాదని, గత తొమ్మిదేళ్లలో అధికార పార్టీ ప్రజలను మోసం చేసినందుకు గాను అవిశ్వాస తీర్మానాన్ని సమర్థిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ, మంత్రిమండలి మీద ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు. మోదీ తక్షణమే ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలగాలనే ఉద్ధేశ్యంతో అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు చెప్పారు. మణిపూర్ మండిపోతుంటే బాధ్యత కలిగిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అక్కడకు వెళ్లాలన్నారు. కానీ వారు కర్ణాటకలో ఎన్నికల సమయంలో ఓట్ల వేట కోసం ఉన్నారన్నారు.

రాముడిని, బజరంగ్ బలిని కూడా రాజకీయాలకు వాడుకుందామని భావించిన బీజేపీ ప్రయత్నాలను కర్ణాటక ప్రజలు తిరస్కరించారన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించి, కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ దేశానికి దిక్సూచీ అన్నారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని, వారు విభజించి పాలిస్తున్నారని ఆరోపించారు. మణిపూర్ లో మెయితీ, కుకీల మధ్య వైరం పెట్టి అధికారం పదిలం చేసుకుందామని భావిస్తోందన్నారు. ఎన్డీయే అంటే నేషన్ డివైడ్ అలయెన్స్ అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ సభలోకి వచ్చి మణిపూర్ ప్రజలకు విశ్వాసం కలిగించేలా బాధ్యతను నిర్వర్తించేలా ఆదేశించాలని స్పీకర్‌ను కోరారు.
Revanth Reddy
Congress
Lok Sabha
Narendra Modi

More Telugu News