Visakhapatnam: విశాఖలో కారును ఢీ కొట్టిన గూడ్స్ రైలు.. కారు నుజ్జునుజ్జు.. తప్పిన ప్రాణాపాయం!

  • పట్టాలు దాటుతుండగా మధ్యలో మొరాయించిన కారు
  • కారును గమనించి రైలు స్పీడ్ ను తగ్గించిన లోకో పైలట్
  • డోర్లు తెరుచుకుని బయటపడ్డ ప్రయాణికులు
Passengers survive after goods train collides with car at midnight in Visakhapatnam

రైలు పట్టాలు దాటుతుండగా మధ్యలో కారు మొరాయించింది.. కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నారు, అటువైపేమో గూడ్స్ రైలు దూసుకొస్తోంది.. ఘోర ప్రమాదం తప్పదని, ఆ నలుగురికి ఆయువు మూడిందనుకునే సమయంలో అద్భుతం జరిగింది. గూడ్స్ రైలు లోకోపైలట్ రైలు వేగాన్ని తగ్గించడంతో కారులోని ప్రయాణికులు డోర్లు తెరుచుకుని బయటపడ్డారు. కారు మాత్రం నుజ్జునుజ్జుగా మారింది. విశాఖపట్నంలోని షీలానగర్ పోర్ట్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ నేవీ అధికారి కుటుంబ సభ్యులు ఈ దారుణ అనుభవాన్ని ఎదుర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు వారి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. నేవీ విశ్రాంత అధికారి ఫ్యామిలీ మెంబర్లు శ్రీహరి పురం నుంచి విశాఖ సిటీకి బొలెనో కారులో వస్తున్నారు. షీలానగర్ పోర్ట్ రోడ్ మారుతి సర్కిల్ వద్ద లూప్ లైన్ ను క్రాస్ చేస్తుండగా కారు మొరాయించింది. సరిగ్గా పట్టాలపైన ఆగిపోయింది.

అదే సమయంలో గూడ్స్ రైలు అదే ట్రాక్ పై వేగంగా వస్తోంది. పట్టాల మధ్యలో కారు ఆగిపోవడం గమనించిన లోకో పైలట్ రైలు వేగాన్ని తగ్గించారు. దీంతో కారులోని ప్రయాణికులకు కాస్త సమయం లభించింది. వెంటనే డోర్లు తెరుచుకుని నలుగురూ బయటపడ్డారు. రైలును ఆపేందుకు లోకోపైలట్ బ్రేక్ వేసినా ఉపయోగం లేకుండా పోయింది. గూడ్స్ రైలు కారును ఢీ కొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జుగా మారింది. ఈ ఘటనకు సంబంధించి గాజువాక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News