Madhya Pradesh: నెలకు రూ. 45 వేల జీతం.. ఆస్తులేమో రూ. 10 కోట్లకు పైనే.. దాడుల్లో బయటపడిన అవినీతి

Rs 10 cr assets found in raids on officer who earned Rs 45 thousand
  • జిల్లా ఆసుపత్రిలో స్టోర్ కీపర్‌గా పనిచేసి రిటైరైన అష్పక్ అలీ
  • ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు ఫిర్యాదు అందుకున్న మధ్యప్రదేశ్ లోకాయుక్త
  • దాడుల్లో రూ. 46 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రూ. 20 లక్షల నగదు స్వాధీనం
  • ఇంట్లో మాడ్యులర్ కిచెన్, లక్షల విలువ చేసే షాండ్లియర్
మధ్యప్రదేశ్‌ ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఓ చిరుద్యోగికి రూ. 10 కోట్లకుపైగా విలువున్న ఆస్తులను చూసి అధికారులు విస్తుపోయారు. లోకాయుక్త దాడుల్లో ఈ విషయం వెలుగు చూసింది. షాప్ కీపర్‌గా పనిచేస్తూ నెలకు రూ. 45 వేల వేతనం పొందుతూ రిటైర్ అయిన అష్పక్ అలీ ఇంట్లో తాజాగా నిర్వహించిన దాడుల్లో రూ. 46 లక్షల విలువైన బంగారం, వెండితోపాటు రూ. 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

భోపాల్‌లోని ఆయన ఇంట్లో మాడ్యులర్ కిచెన్, లక్షల రూపాయల విలువైన షాండ్లియర్, ఖరీదైన సోఫాలు, షోకేస్‌లు, రిఫ్రిజిరేటర్లు, టీవీ ఉన్నాయి. అలీ గతంలో రాజ్‌గఢ్‌లోని జిల్లా ఆసుపత్రిలో స్టోర్ కీపర్‌గా పనిచేసినట్టు లోకాయుక్త ఎస్పీ తెలిపారు. ఆయన ఆస్తుల విలువ రూ. 10 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అలీ భార్య, కుమారుడు, కుమార్తె పేరిట ఉన్న రూ. 1.25 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన 16 స్థిరాస్తుల పేపర్లు ఆయన ఇంటిలో దొరికాయి. 

వీటితోపాటు నాలుగు భవనాలు, ఒక నిర్మాణంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ గురించి కూడా సమాచారం అందుకున్నారు. అంతేకాదు, మూడంతస్తుల భవనంలో ఓ పాఠశాలను కూడా నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అలీ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు సమాచారం అందుకున్న లోకాయుక్త ఈ దాడులు నిర్వహించింది. అవినీతి నిరోధక చట్టం కింద  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
Madhya Pradesh
Store Keeper
Lokayukta
Ashfaq Ali

More Telugu News