manmohan singh: వీల్‌చైర్‌లో రాజ్యసభకు మన్మోహన్ సింగ్.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ!

  • మన్మోహన్ సింగ్ రాకపై ప్రతిపక్షాల హర్షం
  • అనారోగ్యంతో ఉన్న ఆయనను రప్పించడంపై కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన బీజేపీ
  • ఢిల్లీ ఆర్డినెన్స్‌పై చర్చ, ఓటింగ్ సందర్భంగా హాజరైన మన్మోహన్
Former PM Manmohan Singhs presence in wheelchair spurs controversy in Parliament

ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు, 2023పై సోమవారం జరిగిన చర్చ సందర్భంగా రాజ్యసభలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరుకావడంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య వాగ్యుద్ధం జరిగింది. మన్మోహన్ సింగ్ రావడంపై ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేయగా, ప్రతిపక్షాలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఢిల్లీ ఆర్డినెన్స్‌పై సోమవారం రాత్రి వరకు చర్చ సాగింది. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించారు.

మన్మోహన్ సింగ్ రాజ్యసభకు వీల్ చైర్‌లో వచ్చి, ఓటు వేసినందుకు విపక్ష నేతలు కృతజ్ఞతలు తెలిపారు. అయితే అనారోగ్యంతో ఉన్న ఆయనను ఓటింగ్‌కు తీసుకు రావడం కాంగ్రెస్‌కు సిగ్గుచేటు అని బీజేపీ విమర్శించింది.  

మన్మోహన్ కీలక సమయంలో రాజ్యసభకు వచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా కృతజ్ఞతలు తెలిపారు. ఈ బ్లాక్ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడానికి వచ్చి మన్మోహన్ విలువలకు అసలైన అర్థాన్ని చెప్పారన్నారు.

బీజేపీ స్పందిస్తూ.. కాంగ్రెస్ తెలివితక్కువతనాన్ని దేశం మొత్తం గుర్తుంచుకుంటుందని, ఆరోగ్యం సరిగ్గాలేని మన్మోహన్‌ను కాంగ్రెస్ రాత్రిపూట పార్లమెంటులో కూర్చోబెట్టిందని, నిజాయతీలేని ఓ కూటమిని బతికించుకోవడం కోసం ఈ విధంగా ప్రవర్తించిందని, ఇంతకంటే సిగ్గుచేటు చర్య ఉంటుందా? అని విమర్శించింది. అయితే కాంగ్రెస్ ఎంపీ సుప్రియా శ్రినతే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంపై మన్మోహన్‌కు ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు.

More Telugu News