No Confidence Motion: అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టారో చెప్పిన కాంగ్రెస్ ఎంపీ గొగోయ్

  • మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారన్న ఎంపీ గొగోయ్
  • మౌదీ మౌనవ్రతాన్ని భగ్నం చేసేందుకే అవిశ్వాస తీర్మానం పెట్టామన్న కాంగ్రెస్ ఎంపీ
  • వన్ ఇండియా అంటున్న వారే రెండు మణిపూర్‌లను సృష్టించారని ఆగ్రహం
No Confidence Motion To Break PMs Maun Vrat On Manipur says Congress

నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్ష కూటమి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మణిపూర్‌పై ప్రధాని మోదీ చేసిన మౌన వ్రతాన్ని భగ్నం చేసేందుకు ప్రతిపక్ష I.N.D.I.A. కూటమి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకురావాల్సి వచ్చిందన్నారు. ఎవరైతే వన్ ఇండియా అంటూ మాట్లాడుతారో వారే ఇప్పుడు రెండు మణిపూర్‌లను సృష్టించారని ధ్వజమెత్తారు. ఒకటి కొండలలో, మరొకటి లోయలో ఉందన్నారు. మణిపూర్ తమకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తోందన్నారు.

ఎక్కడైనా ఒకచోట అన్యాయం జరిగినా అన్నిచోట్లా న్యాయానికి ముప్పు వాటిల్లుతుందని మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ అన్నారని పేర్కొన్నారు. మణిపూర్‌ కాలిపోతే యావత్‌ భారతదేశం కాలిపోతోందన్నారు. మణిపూర్‌లో విభజన వస్తే, దేశమంతా వస్తుందని హెచ్చరించారు. కాబట్టి దేశానికి నాయకుడైన ప్రధాని మోదీ సభకు వచ్చి మణిపూర్ అంశంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. కానీ ఆయన ఉభయ సభల్లో మాట్లాడనని మౌనవ్రతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉండగా, అవిశ్వాసంపై చర్చను రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని కాంగ్రెస్ మొదట చెప్పింది. అయితే అర్ధాంతరంగా ఆయన పేరును ఉపసంహరించుకున్నారు. కాగా, చర్చ సందర్భంగా ప్రభుత్వం తరఫున కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు మాట్లాడనున్నారు. మరో ఐదుగురు బీజేపీ ఎంపీలు కూడా ఈ చర్చలో పాల్గొంటారు.

More Telugu News