No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించనున్న రాహుల్.. కేంద్రం తరపున చర్చలో పాల్గొననున్న ఐదుగురు మంత్రులు వీరే!

  • లోక్ సభలో కాసేపట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ
  • మణిపూర్ అల్లర్లపై ప్రధాని ప్రకటన చేయాలంటూ విపక్షాల డిమాండ్
  • ఎన్డీయేకు మద్దతుగా వైసీపీ, బిజు జనతాదళ్
Rahul Gandhi To Begin NoTrust Debate

ఈనాటి పార్లమెంటు సమావేశాలు అట్టుడకబోతున్నాయి. మోదీ ప్రభుత్వంపై విపక్ష కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈరోజు చర్చ ప్రారంభం కాబోతోంది. రెండు రోజుల చర్చ తర్వాత ఎల్లుండి ఓటింగ్ జరగనుంది. అవిశ్వాస తీర్మానంపై చర్చను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. 

విపక్షాల అవిశ్వాస తీర్మానం నేపథ్యలో ఈరోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమయింది. సభలో విపక్షాలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై బీజేపీ ఎంపీలకు ఈ సమావేశంలో మార్గనిర్దేశం చేశారు. మరోవైపు సభలో బీజేపీకి ఎక్కువ మెజార్టీ ఉన్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ఎట్టి పరిస్థితుల్లో గట్టెక్కే అవకాశమే లేదు. మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో ప్రధాని మోదీ ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే, ఆయన ఈ అంశంపై సభలో మోదీ ఇంతవరకు స్పందించలేదు. దీంతో, కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. 

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్రం తరపున ఐదుగురు మంత్రులు మాట్లాడతారు. వీరిలో అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు ఉన్నారు. వీరితో పాటు మరో ఐదుగురు ఎంపీలు చర్చలో పాల్గొంటారు. మరోవైపు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఎన్డీయేకు బిజు జనతాదళ్, వైసీపీలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో ఎన్డీయే సంఖ్యా బలం మరింత పెరిగింది. ఈ రెండు పార్టీలకు 34 మంది ఎంపీలు ఉండటం గమనార్హం. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ సభకు గైర్హాజరు కానున్నారు. ప్రధాని లేకుండానే చర్చ జరగబోతోంది.

More Telugu News