Chandrababu: గేట్ల మరమ్మతులకే నిధులు లేకపోతే మూడు రాజధానులు ఎలా కడతారంట!: చంద్రబాబు

Chandrababu power point presentation on Prakasam district irrigation projects
  • సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై చంద్రబాబు యుద్ధభేరి
  • నేడు ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత పర్యటన
  • ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్
  • వైసీపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరిట రాష్ట్రంలోని ప్రాజెక్టులను సందర్శిస్తూ వైసీపీ నేతలను తూర్పారబడుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నేడు ప్రకాశం జిల్లా మల్లవరం విచ్చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నదుల అనుసంధానంతో నీటి సమస్యలు అధిగమించవచ్చని తెలిపారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లను వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు మరమ్మతులు చేయలేకపోయిందని విమర్శించారు. గేట్ల మరమ్మతులకే నిధులు లేకపోతే మూడు రాజధానులు ఎలా కడతారంట అని ఎద్దేవా చేశారు. 

ప్రాజెక్టులకు వైసీపీ ప్రభుత్వం పేర్లు మార్చుతోందని చంద్రబాబు ఆరోపించారు. పేర్లు మార్చడంపై ఉండే శ్రద్ధ ప్రాజెక్టులు పూర్తి చేయడంపై లేదని వైసీపీ సర్కారును విమర్శించారు. 198 ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం ప్రీ క్లోజర్ చేసిందని అన్నారు. 

పోలవరం రాష్ట్రానికి ఒక వరం అని చంద్రబాబు పునరుద్ఘాటించారు. పోలవరం ద్వారా ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టులో 72 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. కానీ, వైసీపీ ప్రభుత్వం వచ్చాక పోలవరాన్ని గోదావరిలో కలిపేసిందని మండిపడ్డారు. కమీషన్ల కక్కుర్తి వల్లే రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని చంద్రబాబు విమర్శించారు. 

"ఇంతవరకు రాళ్లపాడు ప్రాజెక్టు కాలువల పూడిక తీయలేదు. పూడిక వల్ల సోమశిల ప్రాజెక్టుకు 0.5 టీఎంసీల నీరు కూడా రావడంలేదు. పాలేటిపల్లి రిజర్వాయర్ పనులు మూడేళ్లుగా ఆగిపోయాయి. కృష్ణా పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనులు ఆగిపోయాయి. 

ఆ రోజున వైకుంఠపురానికి నీళ్లు తీసుకువచ్చి ఉంటే, అక్కడ్నించి నకిరేకల్ కుడి ప్రధాన కాలువకు నీళ్లు వచ్చి ఉంటే... ఈ సమయానికి గోదావరి నీళ్లు ప్రకాశం జిల్లాకు వచ్చేవి. ఖరీఫ్ పంటకు అక్కరకొచ్చేవి. కాస్తోకూస్తో నీళ్లు తగ్గితే, నాగార్జునసాగర్ డ్యామ్ నుంచి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు సకాలంలో పంట రావడంలేదు, నీళ్లిచ్చే పరిస్థితి లేదు. 

ఒక ఎకరాకు పట్టే నీళ్లను రెండున్నర ఎకరాలకు ఉపయోగించుకునేలా మైక్రో ఇరిగేషన్ ను తీసుకువచ్చాను. దాన్ని కూడా వీళ్లు ఆపేశారు. 

అప్పట్లో కొన్ని వేల కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏర్పాటు చేశాం. కొన్నింటిని రైతులు నిర్వహించగలిగారు, కొన్నింటిని నిర్వహించలేకపోయారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పనిచేయించాం. కానీ వీళ్లు వచ్చాక అన్నింటిని పడకేయించారు" అంటూ చంద్రబాబు వైసీపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు.
Chandrababu
Irrigation
Prakasam District
Power Point Presentation

More Telugu News