Telangana: ఆర్టీసీ బిల్లుపై అదే ఉత్కంఠ.. కాసేపట్లో అధికారులతో గవర్నర్ భేటీ

  • ప్రభుత్వం పంపిన బిల్లుపై గవర్నర్ సందేహాలు
  • బిల్లుపై చర్చించాలంటూ అధికారులకు ఆహ్వానం
  • మధ్యాహ్నం 12:30 గంటలకు ఆర్ అండ్ బీ కార్యదర్శితో సమావేశం
suspense prevails on rtc bill in telangana

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లును తయారు చేసి గవర్నర్ సంతకం కోసం రాజ్ భవన్ కు పంపించిన విషయం తెలిసిందే. అయితే, ఈ బిల్లులోని పలు అంశాలపై మరింత స్పష్టత కావాలంటూ గవర్నర్ తమిళిసై ప్రభుత్వ వివరణ కోరారు. దీంతో ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలో విలీనం అవుతారని, సంస్థ అలాగే కొనసాగుతుందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీనిపై మరోమారు గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేశారు.

బిల్లుపై చర్చించేందుకు ప్రభుత్వ అధికారులకు సమయం ఇచ్చారు. దీంతో ఆర్ అండ్ బీ కార్యదర్శితో సహా ప్రభుత్వ అధికారులతో ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు గవర్నర్ తమిళిసై భేటీ కానున్నారు. ఇదిలా కొనసాగుతుండగా.. ఆర్టీసీ విలీన బిల్లుపై గవర్నర్ వెంటనే సంతకం చేయాలంటూ శనివారం ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ ముందు ఆందోళన చేశారు. రాజ్ భవన్ ను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికుల యూనియన్ లీడర్లతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారు. కార్మికుల సంక్షేమం కోసం, భవిష్యత్తులో వారికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతోనే బిల్లును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని గవర్నర్ ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు.

మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆదివారం (నేటి) తో ముగుస్తుండడంతో ఆర్టీసీ విలీన బిల్లును సభలో ప్రవేశపెట్టే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వానికి ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ఎలాగైనా బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. మరికాసేపట్లో అధికారులతో జరగనున్న భేటీ తర్వాత గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ఆర్టీసీ బిల్లుపై సంతకం చేస్తారా లేదా అనే విషయంపై ఆర్టీసీ కార్మికులతో పాటు ప్రభుత్వ పెద్దలు, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

More Telugu News