Miss International: ఈసారి మిస్ ఇంటర్నేషనల్ పోటీల్లో స్విమ్ సూట్ పరేడ్ ఉండదట... కానీ!

  • 61వ మిస్ ఇంటర్నేషనల్ పోటీలకు జపాన్ ఆతిథ్యం
  • అక్టోబరు 26న టోక్యో నగరంలో గ్రాండ్ ఫైనల్
  • స్విమ్ సూట్ ధరించిన భామలు ఓ వేదికపైకి రావడం ఆనవాయతీ
  • ఈసారి ఓ గదిలో గోప్యంగా స్విమ్ సూట్ రౌండ్
  • కేవలం న్యాయనిర్ణేతలకే ఆ గదిలోకి అనుమతి
There is no swimsuit parade in Miss International beauty pageant

మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ తరహాలోనే మిస్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి. అయితే, ఈసారి మిస్ ఇంటర్నేషనల్ పోటీలకు సంబంధించిన నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది స్విమ్ సూట్ పరేడ్ రౌండ్ ను తొలగించనున్నారు. 

మిస్ ఇంటర్నేషనల్ ఫైనల్స్ కు అర్హత సాధించిన సౌందర్యరాశులు స్విమ్ సూట్, ఈవెనింగ్ గౌన్లు ధరించి హొయలు ఒలకబోస్తూ ఓ వేదికపైకి రావడం పరిపాటి. ఈ మేరకు ర్యాంప్ వాక్ తరహా పరేడ్ జరుగుతుంది. 

అయితే ఈసారి, స్విమ్ సూట్ పరేడ్ రౌండ్ స్థానంలో, ఓ గదిలో అందాల భామలు స్విమ్ సూట్ ధరించి తమ దేహ సౌష్ఠవాన్ని ప్రదర్శించనున్నారు. ఈ ప్రక్రియ అంతా గోప్యంగా జరగనుంది. ఆ గదిలో కేవలం న్యాయనిర్ణేతలు మాత్రమే ఉంటారు. దీనిపై మిస్ ఇంటర్నేషనల్ నిర్వాహకులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. 

"మిస్ ఇంటర్నేషనల్-2023 ఫైనల్స్ లో స్విమ్ సూట్ పరేడ్ ఉండదు. కేవలం ఓ గదిలో స్విమ్ సూట్ రౌండ్ ఉంటుంది. ఆ గదిలోకి న్యాయనిర్ణేతలకు తప్ప ఎవరికీ అనుమతి ఉండదు. దృక్పథం, సమయపాలన, ముఖ సౌందర్యం, శరీరాకృతి, మేధస్సు, సామాజిక సేవ వంటి అంశాల ఆధారంగా విజేతను నిర్ణయించడం జరుగుతుంది" అని ఆ ప్రకటనలో వివరించారు. 

61వ మిస్ ఇంటర్నేషనల్ పోటీలు ఈ ఏడాది జపాన్ లోని టోక్యో నగరంలో జరగనున్నాయి. అక్టోబరు 26న అందాల పోటీలకు ఇక్కడి యోయోగి స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది మిస్ ఇంటర్నేషనల్ పోటీల విజేతకు గతేడాది విజేత జాస్మిన్ సెల్ బెర్గ్ (జర్మనీ) కిరీట ధారణ చేయనుంది.

More Telugu News