Google: ఇంజినీర్ కాదు, ఐఐటీల్లో చదవలేదు.. అయినా గూగుల్‌లో జాబ్.. రూ.50 లక్షల శాలరీ!

  • పూణెలోని ఎంఐటీ-డబ్ల్యూపీయూ విద్యార్థి హర్షల్ జుయికర్ ఘనత
  • కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ, ఆపై బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో ఎంఎస్సీ చేసిన హర్షల్
  • తనంతట తానుగా ఈ రంగంలో కొత్త నైపుణ్యాలు నేర్చుకుని గూగుల్‌ మెప్పు పొందిన వైనం
Pune student lands Rs 50 lakh salary package at Google

గూగుల్ లాంటి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగం రావాలంటే ఇంజినీరింగ్ చేయాలి, ఐఐటీల్లోనే చదవాలన్న భావన తప్పని నిరూపించాడో యువకుడు. ఎంచుకున్న రంగంపై ఆసక్తితో తనంతట తానుగా కొత్త నైపుణ్యాలు నేర్చుకుని గూగుల్‌ను తనవైపు తిప్పుకున్నాడు. ఏటా రూ.50 లక్షల జీతంతో జాబ్ సంపాదించాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన కుర్రాడి పేరు హర్షల్ జుయికర్. 

హర్షల్ జుయికర్ కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చేశాడు. ఆపై పూణెలోని ఎమ్ఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీ నుంచి బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో ఎమ్ఎస్‌సీ చేశాడు. అయితే, ఇంజినీరింగ్ విద్యార్థులు కూడా దుర్లభంగా భావించే గూగుల్‌లో జాబ్ కొట్టేశాడు. 

‘‘కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చేస్తున్నప్పుడు నాకు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం కెరీర్‌కు ఎంతో కీలకమని అర్థమైంది. క్షణక్షణానికి మారిపోతున్న ఈ టెక్ యుగంలో ఉనికి నిలుపుకునేందుకు ఇది అత్యవసరమని భావించాను. దాంతో సొంతంగా కొత్త టెక్నాలజీ నైపుణ్యాలపై పట్టుపెంచుకున్నాను. ఎమ్ఐటీ-డబ్ల్యూపీయూలో చదువుతున్నప్పుడు నాకు ఇండస్ట్రీలోని నిపుణులతో కలిసి పనిచేసే అద్భుత అవకాశం దక్కింది. భారీ డేటా సెట్స్, స్టాటిస్టికల్ ఆల్గోరిథమ్స్, వాస్తవ ప్రపంచంలోని పలు సమస్యలపై పనిచేసే అవకాశం లభించింది. నా అంతట నేను పరిష్కారాల కోసం వెతికే ఛాన్స్ దక్కింది. 

కానీ, చదువు పట్ల నాకున్న శ్రద్ధ, అంకిత భావంతో ఇలాంటి ఫలితం వస్తుందని నేనస్సలు అనుకోలేదు. ఎంచుకున్న రంగంపై నాకున్న అనురక్తి నాకీ అవకాశం ఇచ్చింది. అంతకుమునుపు గూగుల్‌లో ఇంటర్న్‌గా పనిచేయడమూ నాకు లాభించింది. ఆ సందర్భంలో నిపుణులను కలవడంతో నా ఆలోచనల పరిధి మరింత విస్తృతమైంది. ఇన్నోవేషన్, అత్యాధునిక సాంకేతికతలపై పరిశోధనకు పేరుగాంచిన గూగుల్‌లో నాకు అవకాశం రావడం నన్నెంతో ఆశ్చర్యపరిచింది. రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు నేనెంతో ఉత్సుకతతో ఉన్నాను. భవిష్యత్తు బ్లాక్ చెయిన్ టెక్నాలజీదే. ఈ రంగంలో నైపుణ్యం ఉన్నవారికి ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అడ్డంకులు అధిగమిస్తూ అద్భుతమైన ఫలితాలు సాధించడమే మన లక్ష్యంగా ఉండాలి ’’ అని హర్షల్ చెప్పుకొచ్చాడు.

More Telugu News