Yanamala: మళ్లీ అబద్ధాలే...: ఆర్థికమంత్రి బుగ్గనపై యనమల ఫైర్

  • రాష్ట్ర అప్పులపై ఆర్ధికమంత్రి బుగ్గన బుకాయిస్తున్నాడన్న యనమల
  • రూ.7 లక్షల కోట్ల అప్పును రూ.1 లక్షా 70 వేల కోట్లుగా తగ్గించి చెబుతున్నారని వెల్లడి
  • పబ్లిక్ ఫండ్‌లోని ఉద్యోగుల సొమ్ముని వాడుకున్నారని ఆరోపణ
  • సిగ్గు లేకుండా అది తమ హక్కు అంటున్నారని విమర్శలు
Yanamala take a swipe at AP Finance minister Buggana Rajendranath Reddy

రాష్ట్ర అప్పులపై ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరోసారి అబద్ధాలు చెప్పారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాష్ట్ర వాస్తవ ఆర్ధిక పరిస్థితిని ప్రజలకు వివరిస్తున్న పత్రికలపై తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారని, సిగ్గు లేకుండా పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని బుగ్గనపై మండిపడ్డారు. 

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రూ.7 లక్షల కోట్ల అధికార, అనధికార అప్పులు చేసిందని యనమల వెల్లడించారు. కానీ, గత ప్రభుత్వాల కంటే తక్కువ అప్పులు చేశామంటూ బుగ్గన బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

"18 మంది ముఖ్యమంత్రులు 66 ఏళ్లలో రూ.3,62,375 కోట్లు అప్పులు చేస్తే, కేవలం జగన్ రెడ్డి నాలుగేళ్లలో దాదాపు రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారు. గత ఐదేళ్ల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వృద్ధిరేటు 10.78 శాతం ఉంటే జగన్ రెడ్డి అసమర్థత కారణంగా అది 6.4 శాతానికి పడిపోయింది. 

వైసీపీ ప్రభుత్వ ఆర్ధిక నిర్వాహణ అంత అద్భుతంగా ఉంటే ప్రధాన రంగాలైన వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగం ఎందుకు సంక్షోభంలో మునిగిపోయాయి? బుగ్గన పేర్కొంటున్నట్టు, అప్పులపై వైసీపీ ప్రభుత్వం నిజంగానే పారదర్శకంగా లెక్కలు చెబుతోందనుకుంటే... రూ.1,36,198 కోట్లు బడ్డెట్‌లో చూపకుండా అప్పులు చేశారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకు తప్పుపట్టింది? 

ప్రభుత్వాలు ఇంతే అప్పులు చేశాయని రిజర్వ్ బ్యాంకు ఎప్పుడూ ధ్రువీకరించదు. ప్రభుత్వాలు ఇచ్చిన సమాచారాన్ని బట్టే కేంద్ర ప్రభుత్వమైనా, కాగ్ అయినా, రిజర్వ్ బ్యాంకు అయినా తమ నివేదికలు ఇస్తాయి. వైసీపీ ప్రభుత్వం తాము చేసిన అప్పులపై తప్పుడు సమాచారం ఇచ్చి వాటిని రాజ్యాంగ సంస్థలు ధ్రువీకరించాయని చెప్పడం దిగజారుడుతనానికి నిదర్శనం. 

అధిక అప్పులు తెచ్చుకునేందుకు విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసేలా వ్యవహరించారు. మోటార్లకు మీటర్లు పేరుతో రైతుల మెడకు ఉరితాళ్లు బిగించి అదనపు అప్పులు తెచ్చుకున్నారు. పబ్లిక్ ఫండ్ లోని ఉద్యోగుల సొమ్ములను వాడుకోవడమే కాకుండా వాటిని వాడుకోవడం ప్రభుత్వం హక్కు అని చెప్పడం దేనికి నిదర్శనం? 

సంపద సృష్టిలో కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వం కంటే మెరుగ్గా చేసిందని బుగ్గన అబద్ధాలు ఆడుతున్నారు. 2014-19 మధ్య కాలం కంటే 2019-23 మధ్య కాలంలో 10 శాతం అదనంగా సంపద సృష్టించామని చెబుతున్న బుగ్గన... రూ.1.75 లక్షల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించలేక ఎందుకు న్యాయస్థానం చేత చీవాట్లు తిన్నారు? 

చంద్రన్న బడ్జెట్ లో 45 శాతం నిధులు సంక్షేమంపై ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం 24 శాతానికే ఎందుకు పరిమితమైంది? సంక్షేమం పేరుతో బడుగు, బలహీన వర్గాలకు ఆశ పెట్టి ఎందుకు మోసం చేస్తున్నారు? ప్రజలపై రూ.2 లక్షల కోట్ల భారాలు మోపి వారిని పేదలుగా చేసి జగన్ రెడ్డి మాత్రం దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఎలా రూపాంతరం చెందాడు?

చంద్రన్న ఐదేళ్ల పాలనలో 12.18 శాతంగా ఉన్న మూలధన వ్యయంను జగన్ రెడ్డి 6.77 శాతంకు దిగజార్చి దేశంలోనే అతి తక్కువ మూలధన వ్యయం చేసిన రాష్ట్రంగా ఏపీని పతనం దిశగా నడిపించారు. తెలుగుదేశం ప్రభుత్వ దిగిపోయే నాటికి ఉన్న రూ.13 వేల కోట్ల రెవెన్యూ లోటును రూ.48 వేల కోట్లకు, రూ.20 వేల కోట్లుగా ఉన్న ద్రవ్యలోటును రూ.60 వేల కోట్లకు చేర్చారు" అంటూ యనమల విమర్శనాస్త్రాలు సంధించారు.

More Telugu News