Xanthelasma: కళ్ల చుట్టూ బుడిపెలు దేనికి సంకేతమో తెలుసా...!

  • కొన్నిసార్లు కనురెప్పలు వద్ద పసుపు, తెలుగు రంగులో బుడిపెలు
  • వైద్య పరిభాషలో జాంతలెస్మాగా పిలిచే వైనం
  • హై కొలెస్ట్రాల్ కు ఇవి సంకేతాలంటున్న వైద్య నిపుణులు
  • ఈ బుడిపెలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని సూచన
Experts says Xanthelasma an indication to High Cholesterol

కళ్ల చుట్టూ పసుపు, తెలుపు రంగులో బుడిపెలు ఏర్పడితే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనురెప్పలకు సమీపంలో పుట్టుకొచ్చే ఈ బుడిపెలు హై కొలెస్ట్రాల్ కు సంకేతాలని అంటున్నారు. ఈ బుడిపెలు ఏర్పడడాన్ని వైద్య పరిభాషలో జాంతలెస్మా అంటారు. 

శరీరంలో కొలెస్ట్రాల్ ఎలాంటి లక్షణాలు చూపించకుండా నిశ్శబ్దంగా పెరిగిపోతుంది. అధిక స్థాయిలోకి కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగాక... హృదయ సంబంధ సమస్యలు తీవ్రస్థాయిలో ఉత్పన్నమవుతాయి. ధమనులు మూసుకుపోతాయి... గుండెకు రక్తప్రసరణ సరిగా లేక, గుండెపోటు వంటి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి. 

అయితే, చడీచప్పుడు లేకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతోందని చెప్పేందుకు, కనురెప్పల చుట్టూ ఏర్పడే బుడిపెలే సంకేతాలుగా భావించాలి. ఈ జాంతలెస్మా బుడిపెలు చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయిన ఫలితంగా కొవ్వుతో కలిసి చర్మంపై ఉబ్బినట్టుగా తయారవుతాయి. జాంతలెస్మాతో బాధపడేవారిలో సగం మందిలో హై కొలెస్ట్రాల్ నిర్ధారణ అయింది.

ఈ బుడిపెల ద్వారా ఎలాంటి నొప్పి కలగదు... దురదను కూడా కలిగించవు. స్పష్టంగా చూస్తే తప్ప ఇవి కనిపించవు. ఈ తరహా బుడిపెలను గుర్తించిన వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది. డాక్టర్లు తగిన పరీక్షలు మీరు హై కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారో, లేదో నిర్ధారిస్తారు. 

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి ఒక్కటే మార్గం... జీవనశైలిని మార్చుకోవడమే. మంచి తిండి, మంచి అలవాట్లతో చెడు కొలెస్ట్రాల్ ను దూరంగా ఉంచవచ్చు.

More Telugu News