YS Jagan: జగన్ పై దాడి కేసు విజయవాడ నుండి విశాఖ కోర్టుకు బదిలీ

  • ఇకముందు విశాఖ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరుగుతుందని వెల్లడించిన న్యాయమూర్తి
  • 80 శాతం వాదనలు పూర్తయ్యాక బదిలీ సరికాదన్న శ్రీనివాస్ తరఫు లాయర్
  • తదుపరి విచారణ ఆగస్ట్ 8కి వాయిదా
Jagan Kodi Kathi case transfered to Vishaka court

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌పై కోడికత్తితో జరిగిన దాడి కేసు విశాఖకు బదిలీ అయింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ సాగగా, ఇక ముందు విశాఖ ఎన్ఐఏ కోర్టులో జరుగుతుందని ఈరోజు కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి తెలిపారు. 2018 అక్టోబర్‌లో విశాఖ విమానాశ్రయంలో జగన్‌‌పై శ్రీనివాస్‌ అనే వ్యక్తి కోడికత్తితో దాడి చేశాడు. దాడికి పాల్పడ్డ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నాటి నుండి విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు ఈ కేసును విశాఖకు బదిలీ చేశారు. కేసు విచారణను ఆగస్ట్ 8న నిర్వహించాలని ఆదేశించారు.

విచారణను విశాఖ కోర్టుకు బదిలీ చేయడాన్ని నిందితుడు శ్రీనివాస్ తరఫు న్యాయవాది గగన సింధు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో 80 శాతం వాదనలు పూర్తైన తర్వాత మరో ప్రాంతానికి బదిలీ చేయడం సరికాదన్నారు. అయినప్పటికీ తమ వాదనలు ఎక్కడైనా పూర్తిస్థాయిలో వినిపిస్తామని, కేసు కొలిక్కి రావాలంటే జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని గగన సింధు అభిప్రాయపడ్డారు.

నిందితుడికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శ్రీనివాస్ తరుఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం కేసు విచారణకు వచ్చింది. మరోవైపు ఈ కేసుపై జగన్‌‌కు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పైనా విచారణ జరిగింది.

More Telugu News