Police Encounter: ఇద్దరు కరుడుగట్టిన నేరగాళ్లను కాల్చి చంపిన తమిళనాడు పోలీసులు

  • చెన్నై శివారులోని గుడువన్‌చెరీలో ఘటన
  • పెట్రోలింగ్ పోలీసులపైకి నాటుబాంబు విసిరిన నిందితులు
  • కాల్పులు జరిపిన సీఐ, ఎస్సై
  • మోకాలు కింద కాల్చకుండా పైన కాల్చడంపై విమర్శలు
2 Hardened Criminals Killed In Encounter By Tamil Nadu Police

గత అర్ధరాత్రి చెన్నై శివారులోని గుడువన్‌చెరీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కరుడుగట్టిన నేరస్థులు వినోద్, రమేశ్‌ హతమయ్యారు. ఓ ఎస్‌యూవీలో వెళ్తున్న నలుగురు క్రిమినల్స్‌ను పెట్రోలింగ్ పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. వారు ఆపలేదు సరికదా, పోలీసులను ఢీకొట్టుకుంటూ వెళ్లడమే కాకుండా ఓ నాటుబాంబును విసిరారు. దీంతో ఇన్‌స్పెక్టర్, ఎస్సై వారిపైకి కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరు నేరస్థులు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు పరారయ్యారు. 

గాయపడిన వారిని వెంటనే చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతూ మరణించినట్టు పోలీసులు తెలిపారు. హతులు ఇద్దరిపైనా హత్య, దాడి కేసులు ఉన్నట్టు చెప్పారు. కాగా, ఈ ఘటనలో గాయపడిన ఎస్సై క్రోమ్‌పేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

నిజానికి నిందితుల మోకాళ్ల కింద పోలీసులు కాల్పులు జరపాల్సి ఉండగా వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా కాల్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితుల ఎన్‌కౌంటర్‌పై మానవహక్కుల కార్యకర్త, పీపుల్స్ వాచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రీ టిఫాగన్ మాట్లాడుతూ.. ఇది కల్పిత కేసు కాదని భావిస్తున్నట్టు చెప్పారు. ఎస్సైకి తగిలిన గాయంపైనే అంతా ఆధారపడి ఉందని పేర్కొన్నారు. మృతదేహాలకు ఇద్దరు ప్రొఫెసర్లతో పోస్టుమార్టం నిర్వహించాలని, దానిని ఫొటోలు, వీడియోలు తీయనివ్వాలని ఆయన కోరారు. అప్పుడే అసలు నిజం వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు.

More Telugu News